Monday, March 6, 2017

నిత్యపద్యరచన

నీలో దుర్మతి యిట్టులేల కలిగెన్ నిత్యంబు ధర్మాత్ములై
యీ లోకంబున సంచరించు నులౌ యీ ధర్మరాజాదులన్
శ్రీలం దోచి వధింప జూచుట కులక్షేమంబె? నీచేయు పా
పాలే కారణ మన్నినష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా! 1.

విద్యతోడ సద్వివేకంబు సుతులకు
మంచి వర్తనాన మసలు రీతి
క్షితిని నేర్పనట్టి మితిమీరు నా మురి
పాలవలన నష్టమే లభించు. 2.

ధ్యానమును ద్రుంచు నా దూరదర్శనాది
వస్తుజాలము లేవింట వాస్తవముగ
తండ్రి ధనహీనత కతన, తనయు డెదిగె
చదువులను నేర్చి సల్లక్ష్యసాధకుడయి.3.

పరమానందము, స్వార్థహీనత, సుహృద్భావంబు, సంతృప్తియుం
బరసేవాగుణ, మీశ్వరార్చనము, సద్వాక్యాను లాపంబులన్
స్థిరతం బూనుచు నంతరంగమును స్వాధీనంబుగా నుంచ నా
యరిషడ్వర్గము మానవాళికి హితం బందించు నెల్లప్పుడున్. 4.

పరహితము సాధుశీలము
సురుచిర వాక్యానువృత్తి శుభకామనయున్
దరహాసము శాంతియు కా
వరిషడ్వర్గమ్ము హితము నందించు సదా. 5. 

వార్తం జూడగ రండు మిత్రు లిచటన్ భారీ ప్రయత్నంబుతో
కీర్తిం బొంద విహాయసంబున సదా క్షేమంకరం బౌచు మా
యార్తిం దీర్చు నటంచు బంపి రకటా! యాకృత్రి మాకారమౌ
మార్తాండుం డుదయాద్రి గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్. 6. 

కోరిక దీర జన్మమును గూర్మి నొసంగి యనేక బంధముల్
చేరగ జూచి సౌఖ్యముల సిద్ధిని జూపుచు జీవనాఖ్యమౌ
తీరగు నాటకంబునను దీర్చిన పాత్ర ముగించువేళలో
వారక ప్రాణముల్ గొనెడువాడు గదా పరమాత్ముడన్నచో. 7.
(వారక=ఎల్లప్పుడు)   

ధ్రువమగు భక్తి బూనుచును తోరపు శ్రద్ధ గణాధినాయకున్
శివసుతు గొల్చి యాపయిని శ్రీప్రదమైన శ్యమంత సత్కథన్
భవ హర గావుమంచు విన భాద్రపదమ్మున శుక్లపక్షపుం
జవితిని జంద్రదర్శనము సర్వశుభమ్ము లొసంగు మానవా 8.

వరసిద్ధి వినాయకుడిల
నిరతానందంబు గూర్చు నిష్ఠాగరిమన్
స్థిరమతులై బూజించగ
నురుతర విఘ్నాల ద్రోచి యున్నతి యొసగున్.9.

వరసిద్ధి వినాయకునకు
సురుచిర శబ్దాలతోడ సుందర ఫణితిన్
నిరుపమ యశముల నొసగగ
ధర గూర్చెద ప్రణతి శతము తన్మయ బుద్ధిన్.10

పాలు న్నేతులు భోజ్యవస్తుతతులం బల్మారు దండించినన్
నేలం ద్రోతువు, పాడుచేసెదవిట న్నీకంత్యకాలం బిదే
లే లెమ్మంచును వేత్రహస్తులయి మళ్ళించంగ నవ్వారి కో
పాలం జూచిన పిల్లి పాఱె భయసంభ్రాంతుల్ మదిన్ గ్రమ్మగన్.11

కల్ల యొకింత గాదు విను కర్షకు డొక్కరు డద్భుతంబుగా
వల్లులు కొన్ని పెంచె నొక వైపు పొలాన విదేశజంబులన్
పల్లెకు దెచ్చియౌర! తన భాగ్యమటంచును వాటిలోపలన్
మల్లియ! తీగకున్ గలిగె మామిడికాయలు మేలనన్ జనుల్  12

చిత్తంబందున దుష్టభావయుతయై చేరెంగదా బాలునిన్
క్షుత్తుందీర్తునటంచు పూతనమహాక్రూరాత్మ, తత్ప్రాణముల్
మొత్తంబున్ హరియించె నాతడవురా! మున్నాప్రదేశంబునన్
మత్తేభమ్మును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్.13

విత్తంబున్ బహుమూల్య వస్తుతతులన్ విస్తారరూపంబుగా
నుత్తేజంబున బంచి యెన్నికలలో నుద్దండు డాతండు తా
జిత్తైపోవగ నూతనాగతునకున్ జిజ్ఞాసు లిట్లాడి రా
మత్తేభంబును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్.14

మాననీయ! గాంచు మానంద పురమందు
మశకరాజి యందు భృశము దిరుగ
కరచి వ్యాధి గూర్చి  నుడగు నాతని
సామజ! మును గూల్చె దోమ యొకటి 15

నతర మాంగ్లభాషయగు గావున నేర్వు మటంచు బంప నా
దినమున కక్ష్యలో సఖులు దెల్పిన ఫూలను మాట బల్కుచున్
జనకుని దిట్టె నాత్మజుడు, చయ్యన గార్చుచు మోదబాష్పముల్
తనయుని మెచ్చె తండ్రి విని తాను నిరక్షరకుక్షి కావునన్.16

తనతండ్రిని నపహర్తలు
కొనిపోవగ వారిజేరి కోరిన యట్టుల్
ధనమిడి తిట్టుమటన్నను
జనకుని దూషించె సుతుడు సజలనయనుడై.17

కనికరము చూపకుండగ
ననుచితములు పలుకునట్టి యబలను సతిగా
తన కంటగట్టి యుండిన
జనకుని దూషించె సుతుడు సజలనయనుడై18

చక్కదనంబు లేదు, పరిచర్యలు చేయగ శక్తి లేదికన్
ముక్కలుగాగ శల్యములు మేదినిపై చరియించలేక తా
నొక్కట శయ్యపైన పడియుండిన వృద్ధను  భర్తృకాంక్షి న
చ్చక్కను బెండ్లియాడె నొక డందరు సంభ్రమ మంది చూడగన్.19

చక్కని చుక్కై దిరుగుచు
మక్కువతో బలుకరించు మహితగుణాఢ్యన్
మిక్కిలి సంతసమున సీ
తక్కను బెండ్లాడె నొక్క డందరు చూడన్.20

ఆతడు నాహితైషి నను హాస్యము బంచుచు మర్కటంబనున్
చేతము సంతసించు పని చేయును బంధువు లేని నాకు తా
నూతము సత్య మొక్కదిన ముత్తర మొక్కటి  యందుకొన్న నీ
కోతికి జాబు వచ్చెనని గొల్లున యేడ్చుట యుక్తి యుక్తమా21

టాను వచియించ సాధ్యంబు గాని యొకడు
కోటి తనమిత్రు డన్నింట తోటివాడు
పత్రమును జూచి దు:ఖించ బలికె నిట్లు
కోతి కొక జాబువచ్చిన గొల్లు మనియె.22

సారా త్రాగుట హానికారకమురా సర్వంబు గోల్పోదు వా
దారా పుత్రులు వైరులయ్యెదరికన్ తథ్యంబు  నామాట నీ
వీరీతిన్ జరియింప జత్తువని తానిట్లాడు చున్నట్టి స
త్బీరుం గాంచిన త్రాగుబోతు మిగులన్ భీతుం డయెన్ జూడుమా.23

ముల్లోకంబుల నేలుచుందువు గదా! మోదంబులం గూర్చుచుం
కల్లోలంబుల ద్రుంచు దానవగుచుం గైవల్యసంధాయినీ!
తల్లీ! యంచు, సుతుండు బిల్చె నదిగో తండ్రిన్ ముదం బొప్పగన్
ఫుల్లాబ్జానన బార్వతిం గొలువగా పుణ్యాత్ము డవ్వేళలోన్.24

ఎల్లప్పుడు నాటకముల
నుల్లంబులు మోదమంద నువిదల పాత్రల్
పెల్లుగ జేసెడి వానిని
తల్లీయని పిలుచునంట తండ్రిని సుతుడే.25


అల్లీఖానుకు పుత్రు డొక్కడగుటన్ హర్షాతిరేకంబుతో
నల్లా! త్వత్కృప జూపుమా యనుచు మాటాడంగ నేర్పించినన్
సల్లాపంబుల నొక్కనాడు వినరే చాపల్యభావంబు చే
తల్లీ! యంచు, సుతుండు బిల్చె నదిగో తండ్రిన్ ముదం బొప్పగన్ 26

నీమ మొకింత లేక యనునిత్యము దుర్మతులై, మదాంధులై
ధీమతులైనవారలను దిట్టుచు నాస్తిక భావయుక్తులై
భూమి జరించునట్టి యెనుబోతుల దృష్టికి సద్గుణాఢ్యుడౌ
రాముడు రాక్షసుండుగను రాక్షస కాంతగ సీత యయ్యెడిన్.27

నామములు వారి కున్నవి
రాముడు, సీతయుననంగ రంగస్థలిపై
నీమమున నటన జేయగ
రాముడు రాక్షసుడు సీత రక్కసి యయ్యెన్.28

పుడమిని జన్మవృద్ధులును, పోడిమి నింపెడి ప్రేమబంధముల్
కడకిక నత్త రూపమున కట్నముపేరిట నిత్యపీడలున్
పడతికి నాతితోడనె, వివాహము గావలె శాస్త్రపద్ధతిన్
ముడిపడువేళ యింతులకు మోదము గూర్చెడి బాసలందుచున్.29

సుందరాంగివి, దరహాస శోభితవిక
మధురవాక్కులతోడ నా మానసమున
నిలిచి యున్నావు సత్యంబు నిన్నె వినుము
పడతి! నాతి! నే పెండ్లాడవలెను వలచి.30

వినుడా మంత్రి వరేణ్యు డన్నిగతులన్ విజ్ఞప్తులం జేసి నా
ధనమానంబులు మీవి, యండయగుదున్ తథ్యంబు గెల్పించు డో
జనులారా!యని నమ్మబల్కి బహుళైశ్వర్యంబులం బంచి సీ
తనపార్టీ గెలువంగ నెన్నికలలో దానేడ్చె సాజమ్ముగా.31

అనిలుడు హర్షం బందెను
తన పార్టీ గెల్చినంత దానేడ్చె నయో
నుడా నాయక వర్యుడు
తనయోటమి దలచికొనుచు ధరనొంటరియై.32

కొనినా డెంతొ మెజారిటీల నతడున్ గోప్యంపుటోటింగులో
ననుమానం బొకయింత లేక తనకాహా వచ్చు మంత్రిత్వమం
చనుకొన్నా డటుకాకపోవ గనరే యానాయకుం డప్పుడుం
దన పార్టీ గెలువంగ నెన్నికలలో దానేడ్చె సాజమ్ముగా.33

త్వత్కృపచేత నీశ్వర! సుధామయ సూక్తుల బద్యరత్నముల్
చిత్కమలాన నాటునటు చెప్పుచు నుందురు సర్వకాలమున్
సత్కవులెల్ల, మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్
సత్కృతులందరైరి గద శ్రద్ధయొకింతయులేక మాదృశుల్.34

ద్వత్కరుణావిదూరులిల తథ్యము మాదృశు లెంచిచూచినన్.35

 భోజ నరపతి సభలోన తేజమొదవ
వినుడు టంటంట టంటంట యనుచు బలుక
నచట కాళిదా సుడుతక్క యన్యులైన
సత్కవులు పూరణములకు జాలరైరి.36

భోజనరపతి సభలోన పురుషు డొకడు
వచ్చి యప్రశిఖ యనుచు పలుకు చుండ
నచట కాళిదాసుడు దక్క యన్యులైన
సత్కవులు పూరణములకు జాలరైరి.37

మినప గారెలు పూర్ణాలు మిక్కిలిగను
కవివరేణ్యులు వచ్చిరి నమటంచు
చేసి యర్పించ నొకయింట చూసి వాని
 సత్కవులు పూరణములకు జాలరైరి.38

సడ్డం బూనుచు భక్తిపూర్ణమతులై సద్భావసంయుక్తులై
వడ్డీకాసులవాని! వేంకటపతిన్! భాగ్యప్రదున్! శ్రీపతిన్!
గడ్డౌకాలము ద్రోచి సౌఖ్యములతో గావంగ ప్రార్థించినన్
వడ్డీకట్టగ డబ్బులేని యతడే వర్షించు నైశ్వర్యముల్.39

వడ్డీ కాసులవాడయి
యడ్డంకులు తొలగద్రోచి యందరికి సదా
విడ్డూరం బనిపించును
వడ్డీ చెల్లింపలేడు వర్షించు సిరుల్.40

భవ హర శంకరా బహుళ భాగ్యవిధాయక నీలకంఠ నా
స్తవమును స్వీకరించుమని తన్మయు డౌచు మృకండుజుండు తా
నవిరళభక్తిభావయుతుడౌచును గొంకక నిత్యమాయుమా
ధవుని పదమ్ములం గొలిచి ధన్యత గాంచె నతండు వింటిరే41

వివిధములైనమార్గముల విష్ణుకథల్ వినుచుండి యెల్లెడన్
బ్రవిమల భక్తితో బరమ భాగవతోత్తముడౌచు వెల్గి దా
నవపతి యైన తండ్రికి కనంబడు స్తంభజు డైనయా రమా
ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యత గాంచె నతండు వింటిరే.42

కురు సైన్యంబులు ద్రోణు సంరచనచే ఘోరాహవంబందు తా
మురులీలన్నిలువంగ గూల్చుటకునై యుత్సాహి యైధ్యానత
త్పరుడై చేరుట విన్ననొక్కరుడనెన్ ధైర్యాన్వితుండాత డో
ధరణీశా! యభిమన్యు డుద్ధతిని బద్మవ్యూహముం గెల్చెబో.43

నిరతాభ్యాసుడు విశ్వనాథు డవురా! నిష్ఠాగరిష్ఠాత్ముడై
ధరనత్యున్నతులై వెలుంగు ఘనులన్ దాటంగ వ్యూహక్రియన్
భరతోర్విం జదరంగపుం బ్రియులిటుల్ భావించి యన్నార లో
ధరణీశా! యభిమన్యు డుద్ధతిని బద్మవ్యూహముం గెల్చెబో44

పుట్టలు చెట్టుచేమలును పోడిమి నిండిన క్షేత్రరాజి యా
పట్టున నుండగా నచట పంటను గావగ చేరినట్టివా
డొట్టి వినోదకాంక్షి యొక డూరక మంచెను నన్యులెవ్వరుం
జుట్టును లేనివాడు తన జుట్టును దువ్వెను మాటిమాటికిన్.45

పుట్టలు చెట్టుచేమలును పోడిమి నిండిన క్షేత్రరాజి యా
పట్టున నుండగా నచట పంటను గావగ చేరినట్టివా
డట్టె వినోదకాంక్షి యొక డంతట మంచెను నన్యులెవ్వరుం
జుట్టును లేనివాడు తన జుట్టును దువ్వెను మాటిమాటికిన్.46

ధర్మపత్ని, తాను కర్మణ్యులైయుంట
బిడ్డ గావ నొకని బెట్టుకొనిరి
నీళ్ళు బోసి యతడు నిష్ఠతో శిశువుకు
జుట్టు లేనివాడు జుట్టు దువ్వె.47

అకట సమీప వస్తుతతి యంతయు కంటికి దల్లక్రిందులై
ప్రకటితమౌవిధిన్ సురను బానము చేసినవాడు ప్రేలుచున్
వికటముగా వచించెనిటు వింటిరె మిత్రులు యుద్ధభూమిలో
నకులుని జంపె రామనరనాథుడు జానకి సంతసింపగన్48

రాణివాసమందు రాత్రివేళను దూరి
పరుగు లిడుచు నచట తిరుగుచుండి
పత్ని కెంత యేని భయమును గొల్పెడి
నకులు జంపె రామ! నరవిభుండు.49


అవినీతిం గొని సంచరించుటయు హేయంబైన మద్యంబు నా
నవనాడుల్ మునుగంగ ద్రాగుటయు మానంబెంచ కేనిత్యమున్
భువిలో బల్కుచు నుండుటల్ యశములం బోకార్చునో మర్త్య!  నీ
కవియేగా మఱి చేటు దెచ్చు నిలలో గాఠిన్యమే చిందుచున్.50

ముద్దులు గూర్చు వర్ణముల, మోహనమై వెలుగొందు శైలిలో
కొద్దిధనానికే బయట కోరిన పూర్ణ శరీర త్రాణముల్
పెద్దలు పిన్నలందరకు విస్తృత రీతి లభించుచుండగా
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చిన గుండపోతగన్.51

అగజానాథుని వింటి నమ్మిథిలలో నానాడు భంజించి యీ
జగతిన్ సద్యశమందియున్న నుడౌ సత్త్వాఢ్యు డాసీతకున్
మగడై యొప్పును రాము డింపెసగ, నా మండోదరీ భామకున్
తగువా డెందును రాక్షసాధిపతియే తథ్యమ్ము ముమ్మాటికిన్.52

స్వైరవిహార జీవనము స్వార్థము నిండిన నిత్యకర్మలున్
కూరిమి లేని పల్కులును కొంతయు నీశ్వర భక్తిలేమి వి
స్తారపు డాంబికంబులును ధర్మము దప్పుట లున్నచో భువిన్
వైరి స్వదేహ మౌట యనివార్యపు శాపము దీర్ఘజీవికిన్.53

అనుచిత మగువర్తనముల
ననుదినమును గోరినట్టు లతిభోజనముల్
నుడై చేసెడి జనునకు
తన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్.54

కలికాలం బిదియైన గూలునుగదా కారుణ్య సంపూర్ణ నా
యలిమేల్మంగను వేంకటేశమహిషిన్ హర్షప్రదన్ శాశ్వతన్
తులసీ! మాతను గొల్చినన్ దురితముల్, దోరంబులై యబ్బురా
యలఘుప్రాభవముల్ నిరంతర యశం బత్యంత సౌఖ్యంబులున్.55

వనములలోని పుష్పములు భక్తిగ దెచ్చుచు గొల్చువారి జీ
వనమున సౌఖ్యసంపదలు వైభవవృద్ధులొనర్చుచుండి పా
వనమగు సద్యశంబులిడి పాలన జేసెడు తల్లి నాదు భా
వనమును శుద్ధి చేయునిది వాస్తవ మీనవరాత్రిదీక్షతోన్.  56

జయుడను వానికొక్కనికి స్వప్నమునందగుపించె సూర్యుడే
రయమున దాకె చంద్రుని దురమ్మున నాకసమందు గావునన్
భయమును గొల్పురీతిని శుభంకరసాధు జలప్రదాత యా
మొయిలు తటాలునన్ గురిసె భూమిపయిన్ రుధిరం బుదగ్రతన్.57

సుందరాంగుల నిద్దరి జూచి సఖియ
లిద్ద రిట్లాడు కొనుచుండి రింపుమీర
నతడు నాపతి మఱి మగడౌనితండు
నీకు బలుకరింతము పద నిక్కువముగ58

ఆతడు నామగండు, పతియౌ నిత, డూరికి బోయె భర్త, యే
మాతని భార్యసోయగము హర్షిణి నందన కెంతయందమో
చూతము రండురండనుచు సుందర రూపలు కాంతలందరుం
జేతము లుల్లసిల్లు నటు చేరిరొకానొక విందు కోసమై.59

భావనలోన యత్నమున బల్కులయందున నొక్కరీతి సం
భావన జేసి దీనులకు భాగ్యవిహీనుల కెల్లవేళలన్
సేవలు చేయుచుండినను క్షేమము లందగ జేయనట్టిడౌ
దేవుడు లేనె లేడని మదిన్ నెరనమ్ముచు గొల్తు భక్తితోన్.60

శ్రీవిభుని కంటె మిన్నగ
ధీవైభవ మొసగి యెపుడు దీనుల యెడలన్
సేవాభావము గూర్చెడు
దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్.61


రామా! నీసరి రక్షకుల్ గనమిలన్ రమ్యాతిరమ్యంబు నీ
నామంబే గమనించినాడ పలుకన్ నాకిమ్ము సామర్ధ్య మో
స్వామీ!నీ పదసన్నిధిం నిలుచు సద్భాగ్యమ్ము ప్రాప్తించినన్
నీమంబూని సదా చరింతు ననియెన్ నిష్ఠంగపీంద్రుడటన్.  62

రండీ వార్తను మిత్రులార! వినగా రాజయ్య యారోజునన్
దండించంగను బిల్చి తుంటరి సఖుం దా జూపె భక్షించగా
బండున్వీడిక నేడటంచు నిజ మా స్వప్నంబు నంజూచితిన్
బోండా లర్వదియైన నేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలెన్.63

వేషము మార్చనేల, కడువేదన జెందుటదేల నిత్యమున్
భూషణమౌనె సంపదయె, పొందునె సత్సుఖమెందు, లేమిచే
దోషము లెంచ రెవ్వరును, దుష్టుని చెంతను విత్తమున్నచో
భూషితుడై వెలుంగునె, యపూర్వపు గౌరవ మందగల్గునే?64

సాధుజనులందు సన్మార్గ చరులయందు
దోషము లరుదు ధనమున్న, దుష్టునందు
మిక్కుటం బవి లెక్కకు మించియుండు
నలఘు మదజాత కలుష సంకలితుడగుట.65

పెద్దల యనుమతితోనొక
ముద్దియ బెండ్లాడి యిపుడు మురియక మోదీ
వద్దిక యీకాగితములు
రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ.66

పెద్దలు పిన్నల కందరికి
కద్దిర! సుఖమందగలుగు నంచును మోదీ
ముద్దుగ బలుకుచు నోట్లను
రద్దన రాద్ధాంత మేల రాహుల్ గాంధీ.67

పెద్దలు పిన్నలు దీనికి
నొద్దిక జూపింతు రేని యురుఫలితంబుల్
తద్దయు గలుగుం గావున
రద్దన రాద్ధాంతమేల రాహుల్ గాంధీ.68

దేశ వికసనంబె స్థిరలక్ష్యమని చేయు
జగతి కుపకరించు చర్యవలన
విమతులైన వారి వివిధంపు మాటలు
పడ్డవాడు కాడు చెడ్డవాడు. 69

తల్లిదండ్రి గొలిచి ధన్యత్వమును గాంచ
గోరుచుండ జూచి కుమతి జనము
లహరహమ్ము చేయు బహువిధ దూషణల్
పడ్డవాడు కాడు చెడ్డవాడు.70

సంసేవ గోరి సతతంబు నిష్ఠతో
పుణ్యఫలమటంచు భువిని దిరుగు
చుండు కార్యమందు మెండైన కష్టాలు
పడ్డవాడు కాడు చెడ్డవాడు.71

ధర్మరక్షణంబె తనభాగ్య మని యెంచి
సద్ధితంబు గూర్చు సత్కృతులిల
నాచరించు వేళ ననుపంబులౌ పాట్లు
పడ్డవాడు కాడు చెడ్డవాడు.72

పుట్టిన నాటినుండియును బూజ్యులు పెద్దలు తల్లి,తండ్రి నీ
కిట్టివి కూడదంచు వినిపించిన సూక్తులు విస్మరించి  చే
పట్టిన రౌరవాదులకు బాటలు వేసెడి కల్మషాల పెం
గట్టలు గల్గువారు పడు కష్టము నబ్జభవుండెరుంగునా.73

పుట్టుక నొసగిన వారల
నిట్టట్టని బలుకనీక యిడుముల పాలం
బెట్టుచు బొందిన కలుషపు
కట్టలు గలవారి బాధ కంజు డెరుగునా.74

భవదీయామృతగానం
బవనీతలమందు జాలు ననెనా విధి? యా
దివిజూడ దలచినావా?
భువి వీడితి వేల బాల మురళీకృష్ణా?75

సతతానందభరాత్ముడై వెలుగుచున్ సన్మార్గసంచారియై
స్తుతి కర్హంబగు కర్మ చేయు నునిన్ శుద్ధస్వభావాన్వితున్
క్షితి సర్వోత్తముగా గణించ వలయున్ క్షిప్రాగ్రహగ్రస్తు నా
మతిహీనాచలభావ పూరుషుని సన్మానింప సంభావ్యమే?76

స్తుతమతులను గీర్తించిన
నతులితయశ మందుకొనెద రటుగాకుండన్
క్షితి నెట్లౌదురు దుష్టుని
మతిహీన పురుషు నుతింప మాన్యులు? సుమ్మీ!77

అతిదుర్నీతులు లోకమందలమగా నన్యాయకృత్యంబులీ
క్షితిపై నిత్యము విస్తృతంబులగుచున్ చేకూర్చగా క్రౌర్యతన్
వ్రతహీనాత్ములు నిండియున్న జగతిన్ వాదేల తథ్యంబుగా
మతిహీనాచలభావపూరుషుని సన్మానింప సంభావ్యమే.78

ఆర్తి యడంగు మిక్కిలిగ హర్షము గల్గును సర్వమాన్యమౌ
కీర్తియు వచ్చి చేరునిక క్షిప్రమె సౌఖ్యము లందవచ్చు నీ
కార్తిక మాసమందు శితికంఠుని పూజలు సేయ, బాపమౌ
ధూర్తత ధిక్కరించినను దోషము లెంచిన సత్య మెల్లెడన్.79

ఆర్తిహరంబగు సత్యము
కార్తికమున శివుని పూజ, గడు బాపమగున్
ధూర్తుండౌచును రుద్రుని
గీర్తించుచునుండువారి క్రియలను గూల్చన్.80

భూతలభాగ్యశాలి యగు పోడియ నెంపిక చేయు స్పర్థలో
భీతిలకుండ దోసలను విస్తృతరీతి భుజించి యెన్నియో
చేతను లెక్కపెట్టుమన క్షిప్రముగా నట నుంచినట్టి కీ
రా తిని గూడినట్టి చెలి రాతిగ మారె నదేమి చిత్రమో81

వ్యాధింబొందుచు నాంగ్లనామకమహావ్యామోహభూతంబుచే
బాధింపంబడుచుండి తెన్గున సుతున్  భాషింపగా నడ్డుచున్
మేధ:పూర్ణుల మైతి మెల్లగతులన్ మేమన్న నవ్వారికిన్
మాధుర్యం బిసుమంత లేనిది గదా మా యాంధ్ర మీ భూమిపై.82

ఆధిగ నాంగ్లా కాంక్షయె
బాధించుచునుండ దీని బలుకుటనైనన్
వ్యాధిగ దలచెడి వారికి
మాధుర్యములేని భాష మన తెలుగు గదా.83

కరుణయు, ధర్మచింతనము, కమ్మని మాటలు, వర్తనంబునన్
సరసత లేని రాక్షసుల శాసనమందున వ్యంగ్యరీతిలో
నరయుడు కొందరిట్లనెద రానరనాథుని జేరి మ్రొక్కి  భూ
వర! సురలోకమేగుదురు వారక చేసిన బాపకృత్యముల్.84

పరమ పావనమైనట్టి సురనదిగని
గంగ! గంగా యటంచును నతబొగిడి
స్నానమును జేయ వింటిరె దాని మహిమ
స్వర్గలోక మేగెదరట పాపులెల్ల.85

నిరతము దైవచింతనయు, నిష్ఠను బూనిన వర్తనంబుతో
సరసవచస్సుధావిభవశక్తిని బూనుచు సత్త్వయుక్తవై
స్థిరగుణవౌచు సంమున శ్రేయము గల్గెడు రీతినిత్యమున్
వరసురలోకమే గుదురు వారక చేసిన బాప! కృత్యముల్.86

రమ్ము బాలక గణితంపు క్రమము దెలియ
పదికి పదిజేర్చి యటమీద ముదముతోడ
నొకటి రెండుల నద్దాని కొప్పగూడి
మూడు నాలుగు గలిపిన ముప్పది కద.87

చూడిది బాలకా! గణిత సూత్రము చక్కగ నేర్వుమోయి నీ
వాడుచు పాడుచున్ పదికి హర్షముతో బదిజేర్చి మీదటన్
కూడగ వచ్చుమొత్తమున కూర్మిగ నొక్కటి రెండుసంఖ్యలున్
మూడును నాలుగున్ గలియ ముప్పదియౌ గద లెక్కజూచినన్.88


సీ సీ తనయునికై కసి
యాసురగుణుడౌచు నూనె నవ్వారలపై
దా సుమి!త్రపలేకుండగ
దాసునివలెవిభుడు సర్వ తారక మనుచున్  (భారతార్థం) 89

శిక్షితు లైనవారలు, విశిష్టులు ధార్మిక వర్తనంబునన్,
రక్షణ గూర్చబూనుచు  ధరాస్థలి నధ్వరకర్మలన్ సదా
దీక్షగ జేయువిప్రు లిక ధర్మము గూల్చెడివారి కెల్లెడన్
రాక్షసు లెల్లరన్ సతము రక్షణసేయు సహస్రనేత్రుడే.90

దీక్షితుల, విప్రవరులను
రక్షణకై యుచితమైన క్రతువులు చేయన్
దక్షుల,  దుష్టుల యెడలను
రాక్షసుల సహస్రదృక్కు రక్షించు సదా!   91

ఊహాతీతముగాగ నాంధ్రమున తాముత్సాహపూర్ణాత్ములై
యాహా సౌఖ్యదమిద్దియందలపుతో నాంగ్లాది శబ్దంబులన్
స్నేహంబొప్పగ గూర్చి చేతురు కృతుల్ నిష్ఠంబ్రదర్శించుచున్
సాహిత్యాధ్వము దుమ్మురేగినది దుష్కాలమ్ము ప్రారంభమై.92

ఊహాతీతంబగువిధి
యాహాయన్యములజేర్చి యాంధ్రమునందున్
శ్రీహరి!కైతలు వ్రాయరె
సాహిత్యాధ్వమున దుమ్ము సమధిక మయ్యెన్.93

లలితాకార ధరాత్మజన్ బ్రియసఖిన్ లాలింపగా బూని య
య్యలినీలాలక పల్కబోననుటచే నత్యంత హాస్యంబులౌ
పలుకుల్ పల్కుచు సైగ సేయుచు మనోభారంబు దీర్పంగ నో
బల! రాముం డవనీతనూజ గని దుర్వారంబుగా నవ్వెరా.94

అలినీలాలక దనసతి
కలనా డావనములోన నతులితరీతిన్
దలపై దృణములు చేరగ
బల! రాముడు సీతజూచి ఫక్కున నగియెన్.95

అల పీయూషము బంచువేళ తమలో నద్దానవుండుండుటన్
దెలుపన్ శ్రీహరి వానికుత్తుకను వే ద్రెంపంగ నద్దాన నా
ఖలుడూనెం గద దీర్ఘకాలమకటా! కక్షన్ గనుండందుచే
బలవన్మృత్యువు ప్రాప్తమయ్యె రవికిన్ బ్రారబ్ధకర్మంబునన్.96

ఖలుడగు దైత్యుని యునికిని
తెలుపుటచే హరికి యతడు ద్రెంచుట వానిన్
దెలియమె మనమద్దానన్
బలవంతపు చావు వచ్చె భాస్కరునకటన్.97

కవికి సభలోన బంగారు కడియ మొకటి
బహుకరించగ నప్పుడే ప్రకటితమగు
వార్తలను గాంచి జనకుండు పలికెనిట్లు
శంకరా! భరణంబు సమస్యలకు నెలవు.98

దినము మారిన జాలును నతరమగు
పద్యపాదంబు లొసగుచు హృద్యముగను
పూరణంబులు జేయించు నౌర! సతము
శంకరాభరణంబు సమస్యలకు నెలవు.99

సురుచిర పద్యపాదముల జూపును నుండును బూరణార్థమై
నిరుపమమన్నరీతి యనునిత్యము శంకర రక్షణంబులో
కరమరుదౌచు మాదృశుల గాంక్షలు దీర్చెడి కావ్యమందు నే
నరయగ శంకరాభరణమందు సమస్యల వెల్లువే కదా! 100

కానలకు రాము నంపుము
మానితముగ భరతు నిపుడు మహికధిపతిగా
భూనాథ!యుంచు మంచును
దా నుడివిన దపుడు కాంత దశరథున కటన్.                           ౧.
    101                

ఇది గాని దన్య మడుగుట
సుదతీ! యుచితంబు నీకు చూడుము నాకున్
ముదమిచ్చు ప్రాణ మాతడు
వదలుము హఠమంచు  రాజు పలుకగ సతియున్.                  ౨. 102

వరమిచ్చి మాట దప్పుచు
నరపతి! పలుకంగ నిట్లు న్యాయం బగునా?
ధరణిని నిది గాకుండగ
నురుగుణ! యన్యంబు వలవ దున్నతచరితా!                       ౩.103

అని పలికి రామచంద్రుని
తన వద్దకు పిలువ బంచి తన్వంగి కటా!
తనవాంఛ దశరథాధిపు
నతరమగు నాజ్ఞ గాగ క్రమత న్నుడువన్.                          ౪.104

గుణధాముడు శ్రీరాముం
డణుమాత్రము బాధపడక యది తనవిధిగా
ప్రణతులనిడి సంతసమున
క్షణ మాగక విపినభూమి జనినాడు గదా!                                ౫.105

భూతనయ లక్ష్మణుండును
నాతని కనుచారు లగుచు నటవికి జనినా
రీతీరు జూచి జనకుం
డాతత దు:ఖాబ్ధి మునిగి రందరు నకటా!                               ౬.106

అధికార వాంఛ జనులను
బధిరాంధుల రీతి మార్చు, బుద్ధిని గూల్చున్
బుధజన హితవాక్యంబుల
విధమును గాంచంగ నడ్డు విజ్ఞత గాల్చున్.                            ౭.107

జయమగు దరశరథ సుతునకు
జయమగు వినయాది సకల సద్గుణమణికిన్
జయమగు సీతాపతికిని
జయమగు సర్వత్ర రామచంద్రున కవనిన్.                            ౮.108

చేతను డనియెడి ఛాత్రుడు
భీతిల్లుచు బలికె గురుడు బెత్తము జూపన్
కాతరుడయి తడబడుచును
గీతను బోధించె నరుడు గీష్పతి వినగన్.109

ఆతడు మద్యపానమున నాతురుడై వచియించె నిట్టు లా
పోతన వ్రాసె భారతము పూర్వము సత్యము నన్నయార్యుడే
చేతము లుల్లసిల్ల గను చేసెను భాగవతాఖ్య సత్కృతిన్
గీతను జెప్పె నర్జునుడు గీష్పతియే వినగన్ రణంబునన్. 110

నతరమైన చీకటులు క్రమ్మెడు వేళ సరిత్తటంబునన్
వనగత జంతుజాలము సభన్ నడిపించుచు నుండ చిత్ర మా
యినశశిబింబయుగ్మ ముదయించె దినాంతమునందు దద్దిశన్
కనబడె నాకు స్వప్నమున గాంచితి నంచనె మిత్రు డొక్కడున్.111

కనినాడను స్వప్నంబున
నతరముగ నిరులు జగతి గ్రమ్మిన వేళన్
వినుడని పలికెను మిత్రుం
డినహిమకరబింబము లుదయించె నొక మొగిన్.112

తెనుగుకవీంద్రులందు రవితేజుడునా కవి సార్వభౌముడున్
నుడగు పోతనార్యుడొక కాలమునన్ మడి కేగుచుండ నా
వనమున నున్నవారు  కవివర్యుల గాంచి దలంచి రిట్టు లౌ
నినశశిబింబ యుగ్మ ముదయించె దినాంతమునందు దద్దిశన్.113

నుడగు శ్రీనాథుం డా
యనఘుడు పోతన్న తోడ నటు నడువంగా
కనువార లిట్టు లాడిరి
యిన హిమకర బింబము లుదయించె నొక మొగిన్.114
  
వాసిగ బెండ్లికోసమని వారలు తియ్యని సున్ని లడ్డులన్
జేసి యొకింత గాలికయి చేర్చగ వాటిని గుడ్డమీద నా
వాసన బీల్చి వృక్షమున బారుచు దూకుచు నుండి యాగలే
కా సుల జూచి వచ్చినవి గంతులు వేయుచు కోతులన్నియున్.115

సురుచిర సౌఖ్యసంపదలు శుద్ధమనంబున తన్ను బిల్వగా
నరుదగు సద్యశంబిడును హర్షము నింపును జీవనంబునం
దిరుమల వేంకటేశ్వరుడు దేవుడు, గాడని చెప్పిరెల్లరున్
వరమగు భక్తి గొల్చినను పల్కనివాడిల నీయుగంబునన్.116

ఉర్విజనుల గావ నుండ నీయుగమందు
తిరుమలేశు, డెట్లు దేవు డగును
ధరణిపైన నన్యు డరయంగ నారీతి
పలుక కుండు వాడు దలచి యున్న.117

కాళియ నామకుండొకడు కాంతయు దానును పట్నమేగి య
వ్వేళగృహంబుజేరి గడి వెంబడి శబ్ద మదేమిటో గదా
తాళుము చూతమంచు పరదా దొలగించినమీద తీయగా
తాళము, లోని కప్ప కడు దల్లడమందె భయార్త చిత్తయై.118

కాళియుడు ధర్మపత్నియు
కాళిని బూజింప గుడికి క్రమమొప్పగన
వ్వేళకును జేరి తీయగ
తాళము, లోనుండు కప్ప దడదడ లాడెన్.119
  
వశ్యుడు దుర్గుణంబులకు వాక్యవిధానము గాంచకుండ నీ
కాశ్యపి బైనద్రిమ్మరుచు కాలము బుచ్చెడి వాడు మత్తుడై
దేశ్యను భారతాంబనని దెల్పగ బోవుచు బల్కె నీగతిన్
వేశ్యను జూచి మ్రొక్కిరట వేదవిదుల్ గడుభక్తి నెల్లరున్.120

కాశ్యపిపై యశమందిన
దేశ్యను భరతాంబనంచు దెల్పచు సురకున్
వశ్యుడు పలికె నొకండిటు
వేశ్యను వీక్షించి వేదవిదు లిడిరి నతుల్.121

ముమ్మాటికి నారంభను
కొమ్మా! తలదన్నగలవు కువలయమందున్
లెమ్మెవ్వరు నీసరి వెం
కమ్మా! రమ్మనుచు బిలిచె నాలిని మగడే.122

నమ్మం జెల్లును సుందరీ! ప్రియసఖీ నాకస్థయౌ రంభయుం
గొమ్మా! నీసరికాదు సత్యమిదియే కోపించగా నేలనే
లెమ్మీరీతిగ నన్నుజూడ దగునే లేమా! కరంబంది వెం
కమ్మా! రమ్మని పిల్చె భార్యను మగం డయ్యర్థరాత్రంబునన్.124

అంశము- ఉత్తరుని ప్రగల్భములు
ఛందస్సు- ఉత్పలమాల
మొదటి పాదం
1వ అక్షరం 'ఉ'
రెండవ పాదం
7వ అక్షరం 'త్త'
మూడవ పాదం
14వ అక్షరం 'రుఁ'
నాల్గవ పాదం
19వ అక్షరం 'డు'
న్నత విక్రమాన్వితుడ, నుత్తర నామ సుశోభితుండ నే
గ్రన్నన జేరి యిత్తరిని గౌరవ సేనల జీల్చి గోకులం
బెన్న మరల్చి దెత్తునిదె యీరలు,  పౌరులు కుందనేల నా
కన్నిట దక్షుడొక్క డిట నబ్బినచో  రథచోదకుండుగాన్.125

అరులంచున్ మనమందు భావనములే కత్యంత ప్రేమంబుతో
ధరవారందరినిన్ సహోదరులుగా దానెంచి యవ్వారితో
వరసల్లాపము లాడుచుండుట లికన్ భవ్యంబులై వెల్గు నా
దరహాసమ్ములు సాలు వక్త్రమున శస్త్రశ్రేణులన్ మించగన్.126

శాస్త్రోక్తము, వేదోక్తం
బస్త్రంబుల దాల్చకునికి యాహవమందున్
శాస్త్రులు మెచ్చెడి రీతిగ
శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే.127

తనను దలచిన క్షేమంబు లనయ మొసగు
పాపనాశకు నేసును బహుళములగు
వరము లిచ్చుచు నుండెడు భక్తజన వ
శంకరుని గొల్చుచుంద్రు క్రైస్తవులు సతము128

అంకిత భావులై సతత మాకరుణామయు నేసు నెల్లెడన్
శంక యొకింత బూనక లసద్గుణదాతను సర్వరక్షకుం
గింకరులై చరింప నకీర్తి నొసంగెడు ఘోరపాపనా
శంకరు నాశ్రయించిరట సైయని క్రైస్తవు లెల్ల భక్తితోన్.129
  
అవధానం బొక ప్రజ్ఞయౌ నన నసత్యంబే కదా మిత్రమా
రవిరాజా! వినుమంచు నజ్ఞులగుచున్ రమ్యత్వమే లేక తా
మెవరీరీతి వచించువారలు కటా! యెప్పట్టునన్ జూచినన్
స్తవనీయం బయి వెల్గుచుండ భువిలో దైవప్రదత్తంబుగాన్.130

స్తవనీయంబిది యెంచిచూడ నిలలో దైవానుకంపంబుచే
శ్రవణానందకరంబు  సర్వగతులన్ సాహిత్య విజ్ఞానదం
బెవరేనిన్ మది స్వీయమైన కృషిగా నిద్దానినిన్ దల్చి యీ
యవధానం బొక ప్రజ్ఞయౌనన నసత్యంబే కదా మిత్రమా!131

భువిసత్కృషికిని భగవ
త్స్తవమది గూడంగ నబ్బు ధనమిది కనుకన్
గవి కాత్మీయంబగు, కేవల
మవధానము ప్రజ్ఞయనుట యనృతము సఖుడా!132

నేరమును సమ్మతించుచు
గారుణ్యము జూపి నన్ను గావుమటంచున్
గోరిన శత్రువు నైనను
వీరుడు పోవిడుచు యుద్ధవిముఖుం డగుచున్.133


చేతము లుల్లసిల్లునటు చేయగబూనుము సంసేవ నీ
వీతరుణంబునన్ గురుతరేచ్ఛను జూపుచు నందుకోసమై
యాతత శక్తిగోరుమిల నాభగవానుని దేవదేవునిన్
నూతన వత్సరమ్మని వినోద విహారములేల మిత్రమా!134

చేతంబున శుభకామన
లాతత సౌహార్దభావ మందించంగా
సీతాపతి నర్థించక
నూతన వత్సరమనుచు వినోదములేలా?135
  
పట్టు పంచెలు గట్టును పరుగు లిడును
సంతసముతోడ నాట్యంబు సలుపు నిజము
తనకు వారసుడై వెలుగొందు తనయుడొకడు
పుట్ట, గోచిని ధనికుండు పెట్టి మురియు.136

నతరమైన యోగమున కాలము బుచ్చెడివాడు, దైవమం
దనయము భక్తిజూపుచు మహత్సుఖ మొంది చరించువాడు, స
న్మునివరు, డన్నిబంధములు మున్నె త్యజించినవాడు, సాధుతన్
ధనికుడు పుట్టగోచిని సతంబు ధరించి ముదంబు నందురా.137

స్వాయత్తంబగు సజ్జయంబు మనకున్ సత్యంబు సంహారమే
న్యాయం బంచు దలంచి క్రీడి యపుడా యస్త్రప్రయోగంబు తా
జేయం కర్ణుడు చచ్చుటన్ విజయలక్ష్మిన్ బొందె, రారాజనిన్
సాయంబించుకయేని లేక కుమిలెన్ సర్వప్రయత్నంబునన్.138

ప్రేమంబు సంతసం బిడు
ప్రేమంబే యెల్లయెడల బెంచును సుఖమా
ప్రేమమె జీవన మనదగు
ప్రేమము లేనట్టి యునికి రిక్తము గాదే. 139

చెవిటి వాడైన రామయ్య చెంత చేరి
సైగ జేయుచు నవ్వుచు మూగకు వలె
కుశలమేగద? యీరోజు కుడిచి నావె
గాడిదా ! యన నౌనని వాడు మురిసె.140

కరుడు గట్టిన పురుషుని కరకు దనపు
టహము వ్యాపించ స్త్రీపట్ల నహరహమ్ము
విజయ మెవ్వరి దందులో వినగ నా మ
గాడిదా యన, నౌనని వాడు మురిసె. ( గిరీశ్ భావానికి పద్యరూపం)141

మందుడు పరుగిడ డని నీ
నందనునిం దలచుచుండి నానా గతులన్
సుందరి! ధేనువ! జూడుము
కుం దేటికి గొమ్ము మొలిచి కులుచు నడిచెన్.142
(కుందు+ఏటికి)

రమ్మీరోజున రచ్చబండకడ కోరమ్యాత్మ! సన్మిత్రమా!
నెమ్మిం గాంచగ మాంత్రికున్ నుడురా, నిన్నన్ భళా! వాడటన్
సమ్మోదం బొదవంగ దండము పయిన్ సారించగా నప్పుడే
కొమ్ముల్ మొల్చియు గుల్కుచున్ నడచెరా కుందేలు నల్దిక్కులన్.143

శ్రీలాలిత్యము, సర్వసౌఖ్యములికన్ క్షేమంబు లీనేలపై
మేలైనట్టి సుదీర్ఘ జీవనగతుల్ మిన్నంటు  ప్రాశస్త్యముల్
చాలం గావలె నాకటన్న ఫణితిన్ స్వార్ధంబుతోనిండు వాం
ఛాలిన్ వీడిన పూరుషుం డెపుడు బ్రహ్మానందముం బొందురా.144

పలుకులలో మకరందము
జిలుకుచు నొయ్యార మొలుక జేతను సవరా
ల్వెలుగగ బట్టగ నా కలు
కు లటం గని పిలిచి సీత కురు లల్ల మనెన్.145
(కలికి+లు=కలుకులు)

నిరతం బద్భుతశబ్దజాల మహిమన్ నిష్ఠాగరిష్ఠాత్ములై
సరసంబై ప్రజ నెల్లసద్గతులకై సమ్యక్ప్రయత్నం బిలన్
కరముం జేయగ బల్కు కావ్యరచనం గావించు విద్వాంస శే
ఖర పాదమ్ముల సేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతన్.146

సురుచిర శబ్దంబులతో
నిరతానందంబు గూర్చు నిర్మలకృతులన్
విరచించెడి సత్కవి శే
ఖర పదముల సేవ యొసగు గళ్యాణమ్ముల్.147

భావి విధానముం బలికి భాగ్యము లందగ జేయు పద్ధతుల్
జీవిక కోసమై తెలియ జేయుచు నుండెను స్వార్థహీనుడై
కావున నేను నమ్మితిని కాంతుడ!  సత్యము, చెట్టుక్రింది సం
జీవియె నాకు దైవమనె చిన్నది భర్తను లెక్క జేయకన్148

కలి యుగంబిది వింతలు కలిగె ననుట
సహజమే గద యిందేల సందియంబు
దోమ కుత్తుక దూరెను సామజంబు
బీర తీగకు గాచెను బెండకాయ.149

నేర మించుక కాదు మిత్రమ! నీ వసత్యము బల్కినన్
కారణం బిది కాల ధర్మము గాన రమ్మిదె యిచ్చటన్
కూరగాయల తోటలోపల గున్న మామిడి చెట్టునన్
బీరతీగకు గాచె మెండుగ బెండకాయలు చూడుమా.150

భక్తి యుతులౌచు హిందువుల్ పరమశివున
కవని నభిషేకములుసేతు రహము నిశయు
తన్మయత్వాన నీనాడు చిన్మయునకు
క్రైస్తవుల పండుగయె శివరాత్రి యనగ?151

వాస్తవ మైన దియ్యదియ  భాగ్యము గోరుచు నెల్ల హిందువుల్
మాస్తుతులంది నీవిపు డుమాపతి శంకర! మమ్ము గావవే
యస్తు శుభంబు మీకనవె యంచును బ్రార్థన జేతు రెక్క డే
క్రైస్తవు లెల్ల భక్తి శివరాత్రికి జేతురు శంభుపూజలన్?152

హరిహరులు బ్రహ్మ లక్ష్మియు
గిరిజావాణులును గూడి క్షేమంకరులై
వరమీయగ దంపతులకు
నరయగ నబ్బాయి పుట్టె నార్గురి దయతోన్.153

పోలవరంబునం జదువ బోయెడి యాశ్రమవాసు లెల్లరన్
మూలన నక్కి కాళ్ళనట మోదుచు మ్రింగగ దూకబోవుచున్
వాలము నూపు బెబ్బులిని వాడదె శీఘ్రము ధైర్యయుక్తుడై
బాలుర సంహరించి శిశుపాలుడు కీర్తి గడించె బుణ్యుడై.154
(శిశుపాలుడు = శిశురక్షకుడు)

సతము భర్తను సేవించి సంమందు
మాన్య యయ్యె బతివ్రత, మగని రోసి
యన్య యొక్కతె జీవితమందు మిగుల
కష్టములు గాంచె సతత మేకాకి యగుచు.155

మిగులం గాంచిన దొక్క సుందరి కటా! మీనాక్షి కష్టంబులన్
మగనిన్ రోసి, పతివ్రతామణి కడున్ మాన్యత్వముం బొందెరా
తగురీతిన్ దన ప్రాణనాథుని యెడన్ తల్లగ్నచేతంబుతో
నిగమోక్తంబుగ సేవజేసి భువిలో నిష్ఠన్ బ్రవర్తించుచున్.156

ధీమతు లైన నెచ్చెలులు దీప్తియుతుల్ తమకానుకూల్యురౌ
శ్రీమతు లిద్దరున్ జెలిమి చేయుచు నుండగ, యుక్తియుక్తమౌ
మేమిక బంధులైన నని, మిక్కిలి యోచన చేసి, యంతటన్
రాముడు వియ్యమందె బలరామునితో రవిచంద్ర సాక్షిగా157

సుదతీ! విను తన్వంగీ!
హృదయేశ్వరి! చారుశీల! హే కల్యాణీ!
ముదమారగ నా తమ్ముని
వదినా! నీకంద జేతు స్వర్గసుఖమ్ముల్.158

సుదతీ! రాగదె చారుశీల! వినవే! సూక్తిం బ్రసాదించవే
మదిలో నాగ్రహ మేలనే! తెలుపవే మచ్చిత్త సంచారిణీ!
యిదిగో తమ్ముని నూరికిం బనుతునే యీవేళ నివ్వానికిన్
వదినా! కౌగిట జేర్చుకొందు నిను నే స్వర్గంబు జూపించెదన్.159

పాపారాయుడు మందుడు
భూపతి కర్థంబు వ్రాసె పుత్రుండనుచున్
శ్రీపతికి చెప్పె నిట్టుల
ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే.160

శ్రీపతి చెప్పరా యనుచు జేరి గురుం డొకచేత బెత్తమున్
చూపగ కాతరుం డగుచు శూన్యుడు జ్ఞానవిహీను డౌటనా
పాపడి కేమితోచకను బల్కె జవాబుల నొక్కసారిగా
ద్రౌపది సీతయిద్ద రొక తండ్రికి బుట్టిన బిడ్డలే కదా.161


రూపాబాలిక బడిలో
నా పాపకు జనకుడాత డానందు డికన్
గోపాలుం డనువాడే
ద్రౌపది సీతలకు జూడ తండ్రి యొకండే.162

బాపుల పాటి ఛాత్రలగు వారల సూచిక చెప్పిరీ గతిన్
దీపకు తండ్రి దీక్షితులు, దివ్యకు తిమ్మన, రుద్రనాము డా
రూపకు, రోహిణీరమకు రోశయ యాపయి నెంచి చూచినన్
ద్రౌపది సీత యిద్ద రొక తండ్రికి బుట్టిన బిడ్డలే కదా.163