Sunday, December 1, 2013

స్వాగతం

నవోదయ విద్యాలయ, విజయనగరం
 పూర్వ విద్యార్థి సమావేశ సందర్భంగా
పూర్వవిద్యార్థులకు స్వాగతపద్యాలు
01.12.2013
స్వాగతంబు మీకు సన్మార్గవర్తులై
సంఘమందు నేడు సవ్యగతిని
మన నవోదయంపు ఘనమైన కీర్తిని
చాటుచున్న పూర్వ ఛాత్రులార!

"విజయనగర"మన్న విజయాల నగరంబు
మా నవోదయంబు జ్ఞానదంబు
మేటి యంచు సతము చాటుచుండెడి మీకు
స్వాగతంబు పూర్వ ఛాత్రులార!

వివిధ పదవులందు విజ్ఞత జూపించి
యశము లందుచుండి యనవరతము
మీ నవోదయాని కానంద మందింత్రు
స్వాగతంబు పూర్వ ఛాత్రులార!

ఉన్నతంబులౌచు మన్ననలందించు
విద్యలందుచుండు వేళలందు
మన నవోదయంపు ఘనతను కీర్తింత్రు
స్వాగతంబు పూర్వ ఛాత్రులార!

జన్మభూమి మరియు జన్మదాయినియైన
జనని కిచ్చురీతి జ.న.వి.కెపుడు
గౌరవాదరంబు లీరంద జేతురు
స్వాగతంబు పూర్వ ఛాత్రులార!

మా నవోదయంబు మమతల నిలయంబు
చేరబోదమంచు దూరగతుల
గూడ చేరదీసి కూర్మితో వత్తురు
స్వాగతంబు పూర్వ ఛాత్రులార!

జ.న.వి. లోని "జా"ను జయముల గుర్తుగా
"నా"ను తలచుచుండి నవ్యతకును,
"వీ"ని చూపుచుంద్రు విజ్ఞతకై మీరు
స్వాగతంబు పూర్వ ఛాత్రులార!

సాధువర్తనంబు సన్మార్గగమనంబు
సత్యసూక్తి బూని సహకరించు
భావమంది పృథ్వి నేవేళ చరియింత్రు
స్వాగతంబు పూర్వ ఛాత్రులార!

మన నవోదయాఖ్య మానిని కిలపైన
'పంచవింశ' వర్ష మంచితముగ
నిండినట్టి వేళ నిష్ఠబూనెడి మీకు
స్వాగతంబు పూర్వ ఛాత్రులార!

గురుజనులకు దక్షిణగా
నిరతము సన్మార్గగమన నిష్ఠను మీరల్
ధరపై సేవాకృత్యము
నెరపుచు యశమందవలయు నిర్మల హృదితోన్

Tuesday, April 2, 2013

సమస్యాపూరణం-౩


ఏకదంతుడౌచు నినుమడించిన దీప్తి
ఘనత జూపి పిదప గణపతియయి
ముదముగూర్చువాని మోహనాంగుని యాకొ

మరుని ముద్దులాడె గిరికుమారి.     201.(31-03-13)


సురవరులకు సచ్ఛుభకరి
నిరతంబును శాంతమూని నిర్మలమతులై
తిరిగెడు భక్తుల కభయం
కరి సింహమునెక్కి దైత్యగణముల దునిమెన్.202.(01-04-13)


కలలోనైనను దేవుని
దలపక యిల్లాలు, సుతులు, తనవారనుచున్
పలుతెరగుల స్వార్థంబున

కలకాలము బ్రతుకువాడు కామాతురుడే.203(02.4.13) 


స్వార్థబుద్ధితోడ సర్వంబు భక్షించి
నాట్యమాడువాడు నాయకుండు,
కలియుగంబులోన కలుషాత్మకుండౌచు

పాడు పనుల జేయువాడు ఘనుడు 204(03.04.13)


ధరపయినొక్కచోట నవధానము సాగుచునుండె, దానిలో
నరయగ పృచ్ఛకుండొకడు హర్షమునందుచు శేముషీధురం
ధరుడయి తేజరిల్లు నవధానికి నిచ్చె సమస్య నీవిధిన్

నరకుడు సంపె గృష్ణుని సనాతనధర్మము రక్షసేయగన్.
205(04.04.13)


నిగమంబుల దూషించుట
తగినది కాదయ్య, వేదధర్మము మనకున్
తగునని దుర్మార్గుండగు
జగపతి యను సుతునితోడ శర్మార్యుడనెన్.  206(05.04.13) 


ధ్వనిచేతన్ రసభంగమౌను పరమార్థంబెల్ల వ్యర్థంబగున్
మునివృత్తిన్ గొనియున్నవాడ కనుకన్ మూర్ఖాగ్రణుల్! పొండు మీ
రనయం బిచ్చట గోలసేయకుడురా! యంచాడువాడేవిధిన్
ముని కానేరడు, ధీరతన్ గనడికన్ మోదింపలేడెప్పుడున్.  207         

                                                                      06.04.2013

ఘనులౌ చోరుల బట్టువేళ, సుఖముల్ కాంక్షించి సంఘంబునన్
ధనరాశుల్ భుజియించువారి నిలలో దండించు సత్కార్యమం
దనయంబున్ విధిగా రహస్యమె తగున్, హర్షంబు చేకూర్చెడున్
ధ్వనిచేతన్ రసభంగమౌను పరమార్థంబెల్ల వ్యర్థంబగున్ .    208           

                                                                          06.04.2013

కుంతి, మగడు, శూలి, కొడుకు, వాలి.
 
దివిజాధిపతి గోర కవచాదికములిచ్చు
       దానకర్ణుని గన్న తల్లి యెవరు?

కర్ణుని మాతకు కమనీయచరితకు
       పాండురాజేమౌను? పలుకవలయు,

ఆకుంతి కొమరున కర్జునాఖ్యునకిచ్చె
       పాశుపతాస్త్రంపు భాగ్యమెవడు?

మఘవున కేమౌను మహితతేజుండౌచు
        వైభవంబును గన్న ఫల్గునుండు?

"వాలి యుండె నౌర! బాణాలశయ్యపై
భీష్ము" డన్నమాట విన్నయపుడు

మొదటిపదమదేది మోదంబునం జూడ?
కుంతి, మగడు, శూలి, కొడుకు, వాలి.209.  07.04.13


సంగీతజ్ఞులు, సజ్జను
లొంగోలున నుండు జను, లయోగ్యులు స్తుతికిన్
సంగతి గ్రహియించక బహు
భంగుల నవ్వారి దూరు వారలు భువిలో 210(8.413)


వెన్నుని సారథిగా గొని
క్రన్నన చేబూని భవ్య గాండీవంబున్
మన్నిక నేగెడు ఫల్గును

కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే?211

మన్నించబోను నేనని
పన్నెను సత్యాగ్రహంబు బహువిధములుగా
నెన్నంగ నికను గాంధీ

కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే? 212(9.4.13) 


ఔర! యొకచోట కార్యాలయంబునందు
తమ్ముడధికారియయ్యెను దానిలోన
నన్న బంట్రోతు మొదటనె, యెన్న నచట

ననుజు డగ్రజుడాయె తానాదరమున.  213(10.4.13)


వత్సరారంభ మీనాడు వైభవముగ
బంధుమిత్రుల రాకచే బహువిధాల
సుఖము కలుగును సర్వత్ర శుభము లివియె

కాదు, సంతోషదాయక మీదినమ్ము  214(11.4.13)


కరము వికసించి నైర్మల్య మరయగలవు
మారుతిని గొల్చువారల మతులు, చెడును
హృదయమందున్న కలుషంబు, ముదము నిత్య
మబ్బు ననుమాట నిక్కమీ యవనిలోన
.215(14.4.13)


అరయగ తనమానసమున
హర!హర! తోరంపుభీతి యనవరతంబున్
తిరుగుచు నున్నందున పలు

మరు నిం బూజించ మేలు మాతామహికిన్. 216(15.4.13)


యశము ధనము నిచ్చు, వ్యవహారవిదు జేయు
శుభము లందజేయు, సుందరివలె
బోధచేయుచుండు పుడమిని కాన క

వనము సుఖము నొసగు జనుల కెపుడు. 217(20.4.13) 


భారతంబున కన్యాకుమారికెపుడు
దర్శనార్థులు పలువురు తరలివత్తు
రచట పౌర్ణమినాడెంతొ యద్భుతముగ

సూర్యచంద్రుల నొకచోట జూడగలము. 218(21.04.13)


సెలవులివ్వంగ బళ్ళకు నెలకుమించి
హర్షమందుచు బాలకులాడుచుంద్రు
జాలమికనేల? నక్షత్రశాలలోన

సూర్యచంద్రుల నొకచోట జూడగలము  219(21.4.13)


కులుకుచుండి యొక్క జలరాశితీరాన
మత్స్యశాబకంబు మరలమరల
నెగురుచుండ చూచి యెటనుండియో ఒక్క

బకము వచ్చి వాలి ప్రాణము గొనె. 220.(23.04.13)





స్వామి కృపామయుండు క్షితిజాతను పంపుము నీకు మేలగున్
రామపదాబ్జమే శరణురా యని పల్కెను, రావణుం డహో
యేమిర! రాక్షసోత్తమున కీవిధి చెప్పెదు వానరాధమా
క్షేమము చూడబోవనియె చిన్మయరూపుని తూలనాడుచున్.
 

                                                                    221.(24.4.13)
నిశినొక్క మద్యపానుడు
శిశుపాలుడు ప్రాణదాత శ్రీకృష్ణునకున్
దశకంఠుడాత్మజుండగు
దశరథనందనునకనియె తన్మయుడగుచున్.  222(25.4.13)


భవబంధంబును ద్రుంచు బెంచు జనకా! భాగ్యంబు నిత్యంబుగా
జవసత్వంబులనిచ్చు కూర్చు యశముల్ సర్వార్థముల్ తీర్చు మా
నవసంఘంబున కిద్ధరిత్రిననుచున్ నానాప్రకారంబు కే
శవతత్త్వం బెరిగింప తండ్రి వినెనా సత్పుత్రు సద్వాక్యముల్.  

                                                                       223.(28.4.13) 

కారుణ్యాత్మకుడై యనాథజనసంఘాలన్ మహాప్రీతితో
చేరంబిల్చుచు, వారికన్నిగతులన్ క్షేమంబు చేకూర్చుచున్
ధీరత్వంబును నేర్పునట్టి ఘనునిన్ దీనార్థిసౌఖ్యప్రసా

దా! రా రమ్మని పిల్చె నొక్కసతి భర్తన్ ప్రేమ పొంగారగన్.  

                                                                         224.(2.5.13) 

ఎరుగంబోవక పుత్రియంచు నపుడా యిందీవరాక్షుండు భీ
కరుడై దానవశక్తితో సుతను వేగన్ జేరె భక్షించగా
నరయంబోయి స్వరోచి శస్త్రహతుజేయన్ నవ్యతేజంబుతో

కరమొప్పారెను వానిదేహము శరాఘాతమ్ముచే నాజిలోన్.  

                                                                          225.(3.5.13) 

అద్దిర! పినాకపాణియు
నిద్దరు సతులున్నవాడె, హితము గడించున్
పద్దెంబుల, కవనంబుల
నద్దేవుని గొల్చువాడు హర్షముతోడన్.  226.(4.5.13)


ఇల నొకతండ్రి కుమారుని
కలయక చెప్పినను వినక నాటలతోడన్
కులుకి పరీక్షలలో నీ

నెల తప్పిన రాజుగాంచి "నెలరాజ"నియెన్.  227.(5.5.13)


బంగ్లాదేశమువార లెప్పుడయినన్ వంగంబు భాషింతు రా
యాంగ్లేయుల్ సతతంబు దాల్తు రిలలో నాత్మాభిమానంబు, నే
డింగ్లీషే పఠియించు నాంధ్రులకహో! యింపార సంతాన మీ

యాంగ్లంబందున "మమ్మి డాడి" యనుటే యాంధ్రాభిమానంబగున్.  

                                                                          228(6.5.13) 

ముదమున నప్సరసలకో
వది నను బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్
సుదతుల్ విందున కిప్పుడు
కదలుండనిపల్కె నొకడు కలలోని కథన్. 229(8.5.13)


ఛాత్రుడొక్కడు గురువర్యు సత్కరించె
నుంగరంబున, జిరునవ్వు లొల్కె బళిర!
గురుని ముఖమున నాతండు కూర్మితోడ
ననుపమంబైన సుఖముల నందుమనియె.  230(9.5.13)



హనుమ నెట్టుల నమ్మె తానవనిజాత?
ముద్రికను జూడ నేమయ్యె ముదితకపుడు?
వానరేంద్రున కేరీతి పలికె సీత?
ఉంగరంబున, చిరునవ్వులొల్కె, బళిర! 231(9.5.13)


రండో బాలకులారా!
పండుగపై సామెతలను పలుకుండనుచున్
పండితు డడుగగ నొక్కడు
"పండుగనాడేల నాకు పాతమగడ"నెన్.
232(29.7.13)

భువనములకెల్ల ప్రభుడౌచు నవనివారి
క్షేమమరయుచు రక్షణ చేయుచుండు
తిరుమలేశుని దర్శించ నరుగుజనుల
మనము శాంతించు నెన్నొ సమస్యలున్న.        

                                                233(31.07.13)

ఇహము పరమునందు బహువిధ సౌఖ్యంబు
లందజేయుచుండి యనవరతము
నవ్యమైన రామనామామృతంబును
త్రాగి పాడెనంట త్యాగరాజు.235
చీకాకు చెంది యరచుట
రోకటిపో, టౌషధము శిరోవేదనకున్
శ్రీకరమగు శాంతంబును
చేకొని విశ్రాంతి గొనుట క్షితివారలకున్    237
ఔరా! ఛత్తీస్గఢ్లో
తీరగు నృత్యంబు చేయ స్థిరచిత్తముతో
బారులు దీర్చిన యా బం
జారుల కృత్యములు మనకు సంతోష మిడున్ 242
సెప్టెంబర్ 29, 2013

సుస్మిత వదనుడు క్రీస్తీ
క్రిస్మస్ నాడవతరించె, కృష్ణుడు భువిపై
విస్మయము గొల్పి యష్టమి
నస్మద్రక్షణకు జన్మనందెను నాడున్.243

కలియుగంబులోన ఘనుడౌచు వెలుగొందు
విత్తమున్నవాడు వివిధగతుల
నీతిదూరుడైన నేతగాయశమందు
చదువురానివాడు శాస్త్రవేత్త.244

శాస్త్రపఠనమేల సంకల్పశుద్ధితో
దీనజనులసేవలోన సతము
మగ్నుడౌచు హరిని మానసంబున నిల్పు
చదువురానివాడు శాస్త్రవేత్త. 245


చదువురానివాడు శాస్త్రవేత్తయటన్న
చదువుకొన్నవాని సంగతేమి
టన్న సత్య మాత డవివేకి యైనచో
వ్యర్థమతని విద్య వసుధలోన. 246


అరయ నుచితమౌనె? తరతమ భేదాలు
చదువురానివాడు, శాస్త్రవేత్త,
నిమ్ను,డున్నతుండు, నిరుపేద, ధనికుండు
సర్వజనులు భువిని సములు గాదె.247

సాధుహృదయులార! సంఘాని కర్థంబు
చిన్న, పెద్ద మరియు స్త్రీలు, పురుషు
లవనివారలైన యన్నిజాతులవారు
చదువురానివాడు, శాస్త్రవేత్త.248
కామితవరదుడు దశరథ
రాముడు, విననియ్యకొనడు రామాయణమున్
భూమిన్ నాస్తికు డేలనొ
నామార్చన చేయబోడు, నమ్మడు స్వామిన్.249
శంకించక తనువొసగెను
శంకరు డుమకొరకు, పారిజాతము తెచ్చెన్
జంకక కృష్ణుం డప్పుడు
పంకజముఖి సత్యకొరకు పరమప్రీతిన్.250



లంకాధిపు విభుడెవ్వడు?
శంకరు డెందులకు మారె? చక్రియు సతికై
జంకక నేమొనరించెను?
శంకరు, డుమకొరకు, పారిజాతము దెచ్చెన్ 251

సకలలోకైకనాథుడై సర్వజగతి
రక్ష చేసెడి దశరథరామవిభుని
భార్య పదములన్ భక్తితో బట్టదగును.255
భద్రాచలమున కేగుచు
బద్రీనాథుండు మిత్రవర్యుని తోడన్
రుద్రా! చెప్పుము నాకనె
హైద్రాబా దెంతదూర మయ్య కడపకున్ 257
హృద్రోగపీడితుండయి
భద్రుడు వైద్యార్థ మేగవలెనని యిట్టుల్
మద్రాసు మిత్రునడిగెను
హైద్రాబాదెంత దూరమయ్య కడపకున్.258

నిద్రించనేల మిత్రమ!
యీ ద్రవ మొకయింత త్రాగు మీమార్గమునన్
భద్రముగా జేరెదమిక
హైద్రాబాదెంత దూరమయ్య కడపకున్.259
హరికథను విన్న "కువలయ" అనే ఒక యువతి..

దేవాలయమున చెప్పిన
గోవిందుని కథను విన్న కువలయ కలలో
నావిషయమె స్మరియించుచు
గోవర్ధనపర్వతమును గోమలి యెత్తెన్.260
శ్రీవాసుడు చిత్రించెను
గోవర్ధనపర్వతమును, గోమలి యెత్తెన్
సేవాభావము జూపుచు

పోవిడిచిన రంగు, కుంచె, పుల్లల నపుడున్.261
సతము బర్గర్లు నూడిల్సు చాల దినుచు
థమ్సపాదులె హితమని త్రాగుచుండు
భూజనంబుల తలపున పుచ్చకాయ,
నారికేళజలమ్ము ప్రాణమ్ము దీయు.262
నిఖిలజగముల భాగ్యమ్ము నిర్ణయించు
గ్రహము లటుపైని యోగంబు లహరహమ్ము
సహకరించని కాలమ్ము సాగెనేని
నారికేళజలమ్ము ప్రాణమ్ము దీయు.263
రామచంద్రుండు గురుకార్యరక్షణమున
తాటకిని జంపె, భరతుడు తపసి కనగ
నగ్రజన్ముని పాదుకలందుకొనుచు
హర్షమునుబూని త్యజియించె నందలమును.264
గురుని యాజ్ఞను పొంది క్రుద్ధుడై శ్రీరాము
........డెద్దాని నేర్చినా డింతియనక?
కోరక వరియించు కువలయేశత్వంబు
........గడ్డిపోచగ ద్రోచు ఘనుడెవండు?
తనవెంట వచ్చిన దశరథాత్మజులకు
........నస్త్రవిద్యలు నేర్పు నతడెవండు?
"చూడగ" ననుటకు సూటిగా నింకొక్క
........పర్యాయ మేమందు రార్యులార?
చెప్పు డీప్రశ్న లన్నింటి కొప్పుమీర
నుత్తరంబుల నంచాడ నుత్తమముగ
చెప్పవచ్చును వరుసగా చేర్చి యిటుల
తాటకిని జంపె, భరతుడు, తపసి, కనగ.267