నవోదయ విద్యాలయ, విజయనగరం
పూర్వ విద్యార్థి సమావేశ సందర్భంగా
పూర్వవిద్యార్థులకు స్వాగతపద్యాలు
01.12.2013
స్వాగతంబు మీకు సన్మార్గవర్తులైసంఘమందు నేడు సవ్యగతిని
మన నవోదయంపు ఘనమైన కీర్తిని
చాటుచున్న పూర్వ ఛాత్రులార!
"విజయనగర"మన్న విజయాల నగరంబు
మా నవోదయంబు జ్ఞానదంబు
మేటి యంచు సతము చాటుచుండెడి మీకు
స్వాగతంబు పూర్వ ఛాత్రులార!
వివిధ పదవులందు విజ్ఞత జూపించి
యశము లందుచుండి యనవరతము
మీ నవోదయాని కానంద మందింత్రు
స్వాగతంబు పూర్వ ఛాత్రులార!
ఉన్నతంబులౌచు మన్ననలందించు
విద్యలందుచుండు వేళలందు
మన నవోదయంపు ఘనతను కీర్తింత్రు
స్వాగతంబు పూర్వ ఛాత్రులార!
జన్మభూమి మరియు జన్మదాయినియైన
జనని కిచ్చురీతి జ.న.వి.కెపుడు
గౌరవాదరంబు లీరంద జేతురు
స్వాగతంబు పూర్వ ఛాత్రులార!
మా నవోదయంబు మమతల నిలయంబు
చేరబోదమంచు దూరగతుల
గూడ చేరదీసి కూర్మితో వత్తురు
స్వాగతంబు పూర్వ ఛాత్రులార!
జ.న.వి. లోని "జా"ను జయముల గుర్తుగా
"నా"ను తలచుచుండి నవ్యతకును,
"వీ"ని చూపుచుంద్రు విజ్ఞతకై మీరు
స్వాగతంబు పూర్వ ఛాత్రులార!
సాధువర్తనంబు సన్మార్గగమనంబు
సత్యసూక్తి బూని సహకరించు
భావమంది పృథ్వి నేవేళ చరియింత్రు
స్వాగతంబు పూర్వ ఛాత్రులార!
మన నవోదయాఖ్య మానిని కిలపైన
'పంచవింశ' వర్ష మంచితముగ
నిండినట్టి వేళ నిష్ఠబూనెడి మీకు
స్వాగతంబు పూర్వ ఛాత్రులార!
గురుజనులకు దక్షిణగా
నిరతము సన్మార్గగమన నిష్ఠను మీరల్
ధరపై సేవాకృత్యము
నెరపుచు యశమందవలయు నిర్మల హృదితోన్