Sunday, January 26, 2014

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మ.  మనదేశంబు పవిత్రభూమి కనగా మాన్యుల్ మహానాయకుల్
       ధనమానంబులు ధారవోసి యకటా! ధైర్యంబు గోల్పోక భా
       వనలోనైనను స్వార్థమూనక సదా స్వాతంత్ర్య సంపాదనా
        ఘనలక్ష్యంబును బూని సాగిరిగదా! కారుణ్యభావంబునన్.

సీ.    ఎందరో మహనీయు లీకర్మభూమిలో
                      పుణ్యమంతయు ధారపోసినారు,
        ఎందరో ధర్మాత్ము లీధరాస్థలిలోన
                      స్వాతంత్ర్యసమరంబు జరిపినారు,
        ఎందరో కరుణాఢ్యు లీధర్మకార్యాన
                     చెరసాలలోనుండ జేరినారు,
        ఎందరో పుణ్యాత్ములీయజ్ఞవహ్నిలో
                     సమిధలై పొందినా రమలయశము
ఆ.వె.  త్యాగధనులు వారు యోగంబుగా బూని
          హృద్యమైనరీతి నుద్యమించి,
          సకలభారతాన స్వాతంత్ర్యదీప్తుల
          సిరులు విస్తరింప జేసినారు.

ఆ.వె.  అనుచు సభలలోన ననునిత్య మానంద
          మందుచుంట కాదు, సుందరమగు
          భారతమున దివ్యభావంబు వెలుగొందు
          నట్లు చేయవలయు నందరకును.

సీ.      వినయదీప్తి కలిగి విద్యార్థిగణములు
                      శ్రద్ధబూనుచుండి చదువవలయు,
          సకలజనులలోన సౌభ్రాతృభావంబు
                      విస్తరించవలయు వివిధగతుల,
         జగతిలోన సతము శాంత్యహింసలగంధ
                     మలముకొనగ వలయు నందమొప్ప,
         మానవాళిలోన మమతానురాగంబు
                    లినుమడింప వలయు నెల్లవేళ,
ఆ.వె.  భరతభూమిలోన పాడిపంటలవృద్ధి
          కలుగవలయు నెల్ల గతుల ననుచు
          కాంక్షజేయుచుంటి గణతంత్రదినసభా
          ప్రాంగణంబునుండి బంధులార!