జనవరి 29,2014
కనగ నొకనాటి యుదయాన పెనుతుఫానుసాగి యచ్చోట సర్వనాశన మొనర్చె,
ఈప్రమాదము నిట్లు భావించవచ్చు
కటికి చీకటినొసగె భాస్కరుడు వచ్చి. 301
జనవరి 30,2014
పనులు చెడిపోవు, వాస్తవ మనుదినంబు
పగటిపూట నిద్రింప, సంపద పెరుగును
సావధానాత్ములైయుండి సవ్యగతిని
వ్యవహరించుచు నుండెడి వారలకును.302
జనవరి 31,2014
పండ్రెండు వత్సరంబులుగండ్రేటి పురమ్మునందు క్రమముగ మా మా
తీండ్రల్ దీర్చిన పిల్లల
తండ్రీ! రమ్మనుచు బిలిచె తరుణి తనపతిన్. 303
రెండ్రోజులు మనమిచ్చట
గుండ్రాళ్ళేరంగవలయు కూర్చొన కీవున్
పౌండ్రక! రా నాపిల్లల
తండ్రీ! రమ్మనుచు బిలిచె తరుణి తనపతిన్. 304
కాండ్రించి యుమియ నాతడు
వాండ్రకు, వీండ్రకును పెద్ద వాదయ్యె, కనన్
పాండ్రంగ! దీనజనముల
తండ్రీ! రమ్మనుచు బిలిచె తరుణి తనపతిన్. 305
ఫిబ్రవరి 01,2014
భవ్యమౌచు వెలుగుభక్తితో సతతంబురామ యనెడి నోరు, ఱాతిరోలు
తనివిదీర కొంత తడవైన శ్రీరామ
యనని నోరు సత్య మవనిలోన. 306
దీనజనుల కాస్థ, మానితంబుగ ప్రేమ,
మమత సమత సాటి మానవులకు
పంచకుండ సతము భక్తుండ నేనంచు
రామయనెడి నోరు ఱాతిరోలు.307
ఫిబ్రవరి, 02,2014
కక్ష దీరగ ఖండించి క్షత్రియులనువరుస బలుమారు లలనాడు ధరణి నిట్లు
పరశురాముడు నిర్జించె, బాండవులను
గాసి బరచెను కురురాజు మోసమూని. 308
ఫిబ్రవరి, 04,2014
ఆలోకవర్మ యనియెడుబాలుడు తికమకను చెంది బడిలో పలికెన్
వ్యాలాలంకృత ఘనునకు
కాలొక్కటెకలదు మూడుకన్నున దొరకున్. 309
శ్రీలక్ష్మి యనెడు బాలిక
ఫాలంబున కన్ను జూచి పలికెను సఖితో
బాలా! చూడుము రా, టీ
కాలొక్కటె కలదు మూడు కన్నుల దొరకున్. 310
ఫిబ్రవరి, 05, 2014
గానకళాప్రవీణయని ఖ్యాతి వహించిన సుబ్బలక్ష్మికిన్ధీనిధి కొక్కమారు బహుదివ్యసుభూషలు, వస్త్రరాశి స
న్మానములోన గూర్చి రభిమానులు, బాంధవు లెంచిచూడ నా
మానవతీలలామ కభిమానమెచాలును, చీర(యే)లేటికిన్.311
ఫిబ్రవరి, 06, 2014
మత్స్యయంత్రంబు జలములో మాత్రమరసియింపు లొలుకంగ నతడు ఛేదించ నపుడు
ద్రుపదరాట్పుత్రి కర్ణుని తోడబుట్టు
వైన క్రీడిని వరియించె నందమొప్ప. 312
ఫిబ్రవరి, 07, 2014
ఔషధంబులు గొన్నింటి కవసరమగుసత్య మియ్యది నమ్ముడు సర్వజనులు
పలుకగానేల యీరీతి నలుపటంచు
మేక,మెడ? చన్నుపాలతో మేలుగలుగు. 313
ఫిబ్రవరి, 10, 2014
పలుకంగా తరమగునేయిలలో నెవ్వారిభాగ్య మెటులుండునొ? నౌ
కలు బండ్లౌటను కనమా,
పులిగడ్డిని మేయు మాంసమును దిను జింకల్. 314
ఫిబ్రవరి, 11, 2014
భరతనాట్యంబు చేయుట కరుగువేళసుదతి యొక్కర్తె మిక్కిలి ముదముతోడ
పెద్దదైనట్టి యద్దాన స్వీయభంగి
మ గని జడలోన మందార మాల ముడిచె. 315
ప్రాణనాథుని కన్నను పడతి కిలను
వేరు దైవంబు లేనట్టి కారణమున
నతని కానందమునుగూర్చ నతివ మ్రొక్కి
మగని, జడలోన మందార మాల ముడిచె.316
ఫిబ్రవరి, 12, 2014
"మ,న"యను రెండక్షరములుమనమున స్మరియించుచుండి మాన్యుం డొకడున్
తనవారితోడ బలికెను
మన మన మన మనమె మనమె మన మన మనమే. 317
ఫిబ్రవరి, 13, 2014
జగమంతయు క్రైస్తవమునకెగబడుచున్నట్టి వేళ నితిహాసంబుల్
నిగమంబులు రుచియించునె?
భగవద్గీతయె విషమ్ము భారతభూమిన్. 318
ఫిబ్రవరి, 14, 2014
సంధి చేయుము కురురాజ! సభకు బిలిచికలుగు సంతసం బిల్లును వెలుగు దాన
నరయ వలయును ప్రతినిధి విరువురకును
వలదు తగవిక కౌరవపాండవులకు.319
ఫిబ్రవరి, 15, 2014
కష్టములు కలుగజేయునుదుష్టాచారములె, ముక్తి దొరకొన జేయున్
శిష్టాచారము లూనుచు
నిష్టంబుగ చేయుపూజ లిమ్మహిలోనన్. 320
ఫిబ్రవరి, 16, 2014
తల్లులు ముజ్జగంబులకు తారు భవానియు, వాణి, లక్ష్ము లీయెల్లర గావబూని భువికేగిన యట్టుల తీర్చియుండ నా
పల్లెకు జేరి యొక్కరుడు భక్తియు, శ్రద్ధయునూని వృద్ధయౌ
తల్లిని గూడి, చిత్రముగ తామరసాక్షుల గాంచె మువ్వురన్. 321
వల్లియు, నామెచెల్లియగు భారతి, యక్క సుహాసినీత్రయం
బెల్లసులక్షణాఢ్యలిక నింపులు,సొంపులు గుల్కువారలౌ
యిల్లలితాంగులందు మనసెవ్వతె దోచునొ యంచు నాతడున్
తల్లిని గూడి, చిత్రముగ తామరసాక్షుల గాంచె మువ్వురన్. 322
ఫిబ్రవరి, 17, 2014
సుంత యైనను లేదను చింత యేలతినుట, కచ్చోట పెండ్లిని కనుము రమ్ము
భవ్యమౌరీతి భుజియింపవచ్చు పెండ్లి
వారమన, రెండుదినములు వారిజాక్ష! 323
ఫిబ్రవరి, 17, 2014
ఒక్కబడిలోన విద్యార్థు లుంచినట్టిసౌరపరివార చిత్రాల శాలయందు
దీపములమధ్య నెంతేని దీప్తి బయట
చంద్రబింబమ్ము, లోన భాస్కరుడు వెలిగె. 324
ఫిబ్రవరి, 18, 2014
శ్రమియించి క్షీరసాగరమమరులు దానవులు తరియ నాసమయమునం
దమరిన దెయ్యది ప్రథమం
బమృతమ్మో, ప్రాణఘాతమగు గరళమ్మో? 325
తమపంతము నెరవేరగ
సమతను పాటించకుండ సకలాంధ్రంబున్
క్రమముగ జీల్చిన కార్యం
బమృతమ్మో, ప్రాణఘాతమగు గరళమ్మో? 326
ఫిబ్రవరి, 21, 2014
ధ్యానము చేసినన్ పలికి, దైన్యత గూల్చుచు నెల్లవేళలన్మానక గాచుచుండెడి రమాధవు, నచ్యుతు, లోకరక్షకున్
శ్రీనిలయున్, జనార్దనుని, చిన్మయరూపుని, జాతిభేదముల్
కాననివాని నూతగొని కాననివారలు పొంది రున్నతుల్.327
ఫిబ్రవరి, 22, 2014
అట్లుతిని వీధిలోగలజట్లను దాజేరి యొకడు సరసుండగుచున్
చీట్లాటలోన బలికెను
ముట్లుడిగిన రాధకిపుడు మూడవ నెలరా. 328
మార్చి, 05,2014
ఆకంసుని పరిమార్చెనుశ్రీకృష్ణుడు, శూర్పణఖకు చెవులం గోసెన్
తేకువ మీరగ లక్ష్మణు
డేకాలము దుష్టజాతి కిట్లగు నుర్విన్. 329
మార్చి, 06,2014
ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకండ్రు..........మద్యవిక్రేతలౌ మనుజులెల్ల
ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకండ్రు
..........బాలబాలిక లిలన్ బహుళగతుల
ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకండ్రు
..........వాహనచోదకుల్ వైభవముగ
ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకండ్రు
..........గ్రామీణకర్షకుల్ శ్రామికులును
కారణంబులు చూడంగ క్రమత మద్య
విక్రయంబులు పెరుగును, విద్యలకును
సెలవు లభియించు, తమనెందు దలతురిలను,
పేరు పేరున తమకందు గౌరవంబు. 330
ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకంచు
..........వచియించగానేల వసుధలోన
అభివృద్ధి యణగారు, విభవంబు క్షీణించు
..........ధనధాన్య సంపత్తి తరగిపోవు
కలహంబు లధికమై యిలలోన ద్వేషంబు
..........లినుమడించునుసతం బనుచితముగ
నిత్యంబులైనట్టి కృత్యంబులన్నియు
..........చెదరిపోవుటె కాదు ముదమణంగు
కాన నేటేట నెన్నికల్ మానవులకు
హితము కలిగించు ననువాక్య మించుకేని
సత్య మనదగ దెన్నికల్ జరుగవలయు
నైదు వర్షాల కొకసారి మోదమొదవ. 331
07.03.14
గరుడుడు పామును మ్రింగుట
నరసిన యొక చిన్నబాలు డతిభీతుండై
పురమేగి పలికె తడబడి
గరుడుని మ్రింగిన దట భుజగమ్ము గుటుకునన్ 332.
08.03.14
చేతంబు లలరజేయుచు
మాతకు కౌసల్య కొసగ మహితానందం
బాతన్వికి నాథుండై
సీతకు, రాఘవుడుపుట్టి శివధనువెత్తెన్. 333.
10.03.14
ధూర్తుండై జనకజ నపు
డార్తికి గురిచేయువాని, నఘసంయుతు, దు
ర్వర్తను, రాముడు రాక్షస
భర్తను వధియించ వనిత పరితోషించెన్. 334
11.03.14
అనుమానమేల వీనిని
చనుబాలం గుడిపి యముని సదనంబునకున్
కనుడిదె పంపెదనని పూ
తన, బాలుని చంపనెంచి తానే జచ్చెన్. 1. 335
అనయము హరినామము తా
ననుపమముగ బల్కువాని, నసురాధిపుడున్
ఘనుడౌ హిరణ్యకశిపుడు
తనబాలుని జంపనెంచి తానే జచ్చెన్. 2. 336
13.03.14
పరమ దుర్మార్గుడైనట్టి నరున కిలను
సద్గుణాఢ్యుడు జన్మించు సరణి నరసి
పలుకగా వచ్చు నుపమాన మొలుక నిట్లు
"పందికిన్ బుట్టె చక్కని పాడియావు" 337
14.03.14
పన్నెండవతరగతిలో
మున్నొక తడబాటుతోడ మోహనుడనువా
డన్నాడు మిత్రులారా!
వెన్నెల ఱేని వెలుగులకు విచ్చె గమలముల్ 338.
17.03.14
సాటివారియందు సహకారభావంబు
భూతదయయు ధర్మభీతి భువిని
మాతృదేశభక్తి మనమున లేకున్న
విష్ణుపూజ నరులు విడువదగును. 339.
18.03.14
శ్రీకరుడను మునివర్యుడు
ప్రాకటముగ తపముచేయు ప్రాంతమునందున్
చీకాకు నొందకుండగ
కాకియు గోకిలయు గలసి కాపురముండెన్. 340
23.03.14
చేతంబు లలరజేయును
గీతాపారాయణంబు, గీడొనరించున్
భూతలమున పాఠకజన
పాతకములకు, పరమునను భాగ్యం బొసగున్. 341.