Saturday, September 13, 2014

కర్తవ్యబోధ


68వ స్వాతంత్ర్యదినోత్సవసందర్భంగా
విద్యార్థులకు కర్తవ్యబోధ
సీసమాలిక
బాలబాలికలార! భవ్యభారతమందు 
          ప్రభవించు సద్భాగ్యవిభవమబ్బె
ఏజన్మలో మీర లేపుణ్యకార్యంబు 
          లాచరించిరొగాని యనుపమమగు
జన్మమిమ్మహిలోన సన్మానయుతముగా
          పొందియున్నారెంతొ సుందరంబు
వేదాల పుట్టిల్లు, మోదాల నిలయంబు, 
          శాస్త్రషట్కంబుల స్థానమిద్ది
ఇతిహాసగ్రంథంబు లీధరాస్థలిలోన 
          విలసిల్లు నిత్యంబు లలితగతిని,
అష్టాదశంబులౌ నాపురాణంబుల 
          జన్మప్రదేశ మీక్ష్మాతలంబు,
ముక్కోటి దేవతల్ చక్కంగ నీనేల 
          సద్రూపధారులై సంతతంబు
సంచరించుచునుండి సానందచిత్తులై 
          వరములిచ్చుచు నుందురురుతరముగ,
ఘనగుణుల్ మునివరుల్ కశ్యపాత్ర్యాదులు 
          క్షేమంబు లరయ నీభూమిపైన
తిరుగాడుచుండు రిద్ధరణిమాహాత్మ్యంబు 
          వర్ణింపదరమౌనె బ్రహ్మకైన
పరమపావనమైన భారతావనిలోన 
          పారతంత్ర్యము నాడు పేరుకొనగ
స్వార్థంబు విడనాడి సర్వంబు త్యజియించి 
          ప్రాణాలు సైతంబు పణము బెట్టి
బందిఖానాలలో బహుకష్టములకోర్చి 
          యవమాన మనునిత్య మనుభవించి
ఛీత్కరించుచు జేరి చెదరగొట్టిన గాని 
          సంకల్పసిద్ధికై సడలకుండ
సత్యాగ్రహంబుతో సన్మార్గగాములై 
          పోరాట మొనరించు వీరవరుల
బలిదాన ఫలముగా భారతోర్వరలోన
          స్వాతంత్ర్యపవనాలు వ్యాప్తమయ్యె
నిత్యకల్యాణంబు, నిరతసంతోషంబు 
          లీపుణ్యభూమిలో నెల్లయెడల
ప్రభవించి సర్వత్ర శుభదర్శనంబయ్యె 
          జీవనంబున జూడ క్షేమమొదవె,
సంతోషజలధిలో సతతంబు మునుగుచు
          హాయినందుచునుండి రఖిలజనులు
హర్షమో, గర్వమో, యదిగాక నిర్లక్ష్య
          భావమో గాని యీ భరతభూమి
నెల్లచోటులయం దుల్లసిల్లుచునుండె 
          యవినీతి భూతమై యనుదినంబు
సౌభ్రాతృభావంబు సన్నగిల్లుటెగాదు 
          మతమౌఢ్య మలమెను మతులలోన
విభజనవాదంబు విస్తరించుచునుండె 
          స్వార్థమే లక్ష్యమై సాగుచుండె,
పాలకాగ్రణు లిందు పరమహర్షంబుతో 
          కుడుచుచుండిరి నిధుల్ కోట్లకొలది
ధరలు నింగినిదాకె, నరునిజీవన మేమొ 
          దుర్భరంబై యిలన్ దు:ఖ మొదవె,
అరువది యేడేండ్లు జరిగిపోయెనుగాని 
          సమ్మాన మతివకు సన్నగిల్లె,
అభివృద్ధి యనుమాట లల్లంతదూరాన 
          తాము గ్రంథములందు దాగియుండె,
అక్రమంబులు దౌష్ట్య మన్యాయకృత్యంబు 
         లనునిత్య మీనేల నధికమయ్యె,
సత్కార్యదీక్షలో సన్మార్గగమనాన
        సత్యవాక్పాలనాకృత్యమందు
జనులలో నొకయింత సహకారభావంబు 
          మృగ్యమై కపటంబె యోగ్యమయ్యె,
మాతృదేశముపట్ల మమతానురక్తులీ 
           ధరణిలోనను క్షీణదశకు జేరె,
సోదరుల్ శత్రులై భేదభావముబూని 
          చరియించుచుండిరి సర్వజగతి
యీపరిస్థితులందు నీరీతి ప్రతియేట 
          జాతీయపర్వముల్ శ్రద్ధబూని
చేయుచుంటిమి మాకమేయమౌ సద్భక్తి 
          దేశాన గలదంచు దీక్షజూపి
గీతాలు పలికించి చేతంబులలరించి 
          మువ్వన్నె జెండాలు మురిపెమునను
గగనమంటెడునట్టు లెగురవేయుచు నిల్చి 
          యమరవీరుల త్యాగ మందమొప్ప
వక్తృత్వపటిమతో వైభవోపేతమౌ 
         యాటపాటలతోడ దీటుగాను
వారంచు వీరంచు పేరులు వల్లించి 
          పూర్వగాథలనెల్ల బోధజేసి
వత్సరానికి రెండు పర్యాయములు నిట్లు 
            స్మరణచేసిన చాలు వరుసననుచు
దలచిన చాలునా? ధన్యత్వమొదవునా? 
             మాతృదేశపుసేవ మరువదగునా?
భాగ్యనిధియౌచు వెలిగిన భారతాన
నిత్యతాండవమాడుచు నిలిచియున్న 
ఘోరమైనట్టి  యవినీతి, కుటిలమతియు,
స్వార్థభావంబు, దౌష్ట్యంబు, సకలగతుల
వంచనంబులు, బహువిధవైరములును,
మతము పేరిట యిలవారు గతులుదప్పి
క్రౌర్యములనూని మనుటయు, కనికరంబు 
చూపకుండుట, నిత్యంబు శోకజలధి
మునుగుచుండెడివారల ననునయించి
సాయమందించలేమియు, సన్మతిగని
యంతమొందించు ప్రతిన లియ్యవసరమున
బూని మున్ముందు సద్భావ పూర్ణులగుచు
సంచరించుచు, కష్టాల సాగరమున 
కూలియున్నట్టి భారతకువలయంబు
నుద్ధరించెడి కార్యాల నుత్సహించి
ముందుకేగుచు యిసుమంత సందియంబు
నందకుండగ విఘ్నాల నధిగమించి
సాగుచుండుచు సర్వత్ర సద్యశంబు
లందవలె మీరు సచ్ఛాత్రు లందమొప్ప
శుభము గల్గెడు నానాడు విభవపంక్తి
నిండు భారతదేశాన మెండుగాను
దేశభక్తుల త్యాగాల దీప్తియపుడు
వ్యాప్తమై యొప్పు దిశలలో ననుట నిజము
సవ్యమైనట్టి స్వేచ్ఛయు నవ్యసుఖము
లందగలవప్పు డనుటలో సందియంబు
లేదొకింతయు బాలకుల్ మోదమందు,
జన్మసాఫల్య మావేళ ఛాత్రులార!
పొందవచ్చును, ప్రతినను బూనరండు
భావిభారతపౌరులౌ బాలలార!
వారు వీరను భేదంబు చేరనట్టి
విమలచిత్తాఢ్యులైయుండు పిన్నలార!
అతులతేజంబు గల్గు విద్యార్థులార!


 


వరసిద్ధవిఘ్నేశ్వర



శ్రీరామ
వినాయక దండకం(జ.న.వి.కిల్తంపాలెం విద్యార్థుల నిమిత్తం)
శ్రీసిద్ధివిఘ్నేశ్వరా! దేవ!దేవాధిదేవా! ఉమానందనా! స్వామి! భద్రేభవక్త్రా! సర్వార్థసంపత్ప్రదా! ప్రత్యబ్దసంపూజితా! నిన్ను కిల్తాఖ్యపాలెంబు నందున్న విద్యాలయంబందు విద్యార్థిసంఘంబులౌ మేము సద్భక్తితో స్థాపనం జేసియున్నార మీవేళ నీవద్ద బద్ధాంజలీయుక్తమౌ ముద్రలందాల్చి సప్తాహపర్యంత మాపైన రెన్నాళ్ళు నిత్యంబు వేళాద్వయంబందు శ్రద్ధాఢ్యతంబూని పూజించగా నిల్చియున్నార మోదేవ! మున్ముందుగా నాచతుర్థిన్ సుకల్పోక్తరీతిన్ విశేషంబులైనట్టి పత్రాదిసామగ్రినిం దెచ్చి, టెంకాయలున్ పుష్పముల్, మాలలున్, ధూపముల్, దీపముల్ గూర్చి, సత్పూజలం జేసి, యుండ్రాళ్ళు, వడ్పప్పు, బెల్లంబు, పండ్లప్పముల్, గారెలున్, బూరెలున్ దెచ్చి రుచ్యంబుగా నీకు నైవేద్యముల్ చూపి, విఘ్నేశ్వరోత్పత్తియు న్నాశ్యమంతాఖ్యమై యొప్పు నాఖ్యానమున్ శ్రద్ధతో నేకచిత్తంబునుంబూని చెప్పించుకొన్నాము, మంత్రోక్తరీతిన్ సుపుష్పంబు లందించియున్నాము, ఛత్రాదులున్, చామరంబుల్, సుగీతంబులు న్నీకెయర్పించియున్నార మోదేవ! యీదీక్షలో నిత్య మీరీతి సూర్యోదయంబందు, సాయాహ్నకాలంబునన్ నిన్నె యర్చించుచున్నాము, పూజావిధానంబు, మంత్రంబులం నేర్వలేమైతి అత్యుత్తమంబైన సద్వాక్య సంపత్తి యింతేనియున్ లేని యజ్ఞాన మందున్న మేమిచ్చటన్ జేయుచున్నట్టి పూజాదిసర్వోపచారంబులం స్వీకరించంగ నిన్వేడుచున్నాము, మాపైని కారుణ్యముంజూపుమా, యజ్ఞానమున్ ద్రుంచుమా, దోషముల్ సైచి,  సద్విద్యలందించుమా, ధాత్రిలో మాకు సద్బుద్ధి, విజ్ఞానసంపత్తి, సత్కీర్తి, యారోగ్యభాగ్యంబు, సత్త్వంబు, సన్మార్గసంచారధైర్యంబు, సత్పాత్రతాదీప్తితోడన్ జయం బెల్లకాలంబులం గూర్చి, సత్పౌరులం జేయుమా, దేశభక్తిన్ సదానిల్పి విద్యాభివృద్ధిన్ ప్రసాదించి మమ్మున్ వివేకాఢ్యులం జేయుమా, దేవదేవా! మహాకాయ! లంబోదరా! ఏకదంతా! గజాస్యా! సదావిఘ్ననాశా!మహేశాత్మజాతా! ప్రభూ! నాగయజ్ఞోపవీతా! భవానీతనూజా!త్రిలోకైకనాథా! సదామందహాసా! సురేంద్రా! గజేంద్రాననా! శూర్పకర్ణా! నమస్తే నమస్తే నమస్తే నమ:|

వరసిద్ధివినాయక నీ
కరుణను మాపైన జూపి కావుము మమ్మున్
నిరుపమమగు సద్విద్యలు
సురుచిర విజయాలు గూర్చి సుందరమూర్తీ!

శ్రీమంతంబగు కిల్తమాఖ్యపురిలో చిద్రూపముం దాల్చుచున్
స్వామీ! యిచ్చట యీ నవోదయమునన్ సత్పూజలం బొందుచున్
క్షేమంబుల్ విజయంబు లిచ్చుచు సదా చేయూతగా నిల్చుచున్
భూమిన్ కావుము ఛాత్రసంఘమునికన్ పూజ్యా! భవానీసుతా!

సీ.      గజవక్త్రమును దాల్చు కమనీయరూపియౌ
వరసిద్ధివిఘ్నేశ! వందనంబు
శూర్పకర్ణములూను సుందరాకారివౌ
వరసిద్ధి గణపతీ! వందనంబు
లంబోదరంబుతో సంబరంబులు నింపు
వరసిద్ధివిఘ్నేశ! వందనంబు
యజ్ఞోపవీతార్థ మహిరాజములు దాల్చు
వరసిద్ధి గణపతీ! వందనంబు
మోదకంబులవైపు సాదరంబుగ జూచు
వరసిద్ధివిఘ్నేశ! వందనంబు
ఇక్షుఖండముజూచి యెంతేని ముదమందు
వరసిద్ధి గణపతీ! వందనంబు
ప్రతివర్ష మరుదెంచి సతతసౌఖ్యం బిచ్చు
వరసిద్ధివిఘ్నేశ! వందనంబు
వివిధంబులైనట్టి విఘ్నసంతతి బాపు
వరసిద్ధి గణపతీ! వందనంబు
తలచిపిల్చినవారి కలఘుసంపదలిచ్చు
వరసిద్ధివిఘ్నేశ! వందనంబు
విజ్ఞానసంపత్తి విద్యార్థులకు గూర్చు
వరసిద్ధి గణపతీ! వందనంబు
కార్యాల నన్నింట ఘనజయంబులు నింపు
వరసిద్ధివిఘ్నేశ! వందనంబు
ఏరూపమున బిల్వ నారూపమున బల్కు
వరసిద్ధి గణపతీ! వందనంబు

ఆ.వె.  జవహరాఖ్యమైన చదువుల నిలయాన
మోదభరితమగు నవోదయాన
దీక్షబూని నిన్ను దివ్యసుందరదేహు
నుంచి పూజ చేయుచుంటి మిచట.
ఆ.వె.   మేము చేయు పూజ కామోదమును దెల్పి
స్వీకరించి, మమ్ము చేరదీసి
సుముఖముద్రతోడ శుభములందగజేసి
కావుమయ్య యెపుడు ఘనతరముగ.
ఆ.వె.   వినయదీప్తి యొసగి విద్యాభివృద్ధికై
యాశిషంబు లొసగి యఖిలములగు
నికషలందు మాకు నిరుపమ విజయాల
నందజేయుమయ్య! యనవరతము.

Thursday, March 6, 2014

సమస్యాపూరణం-4

 జనవరి 29,2014
కనగ నొకనాటి యుదయాన పెనుతుఫాను
సాగి యచ్చోట సర్వనాశన మొనర్చె,
ఈప్రమాదము నిట్లు భావించవచ్చు
కటికి చీకటినొసగె భాస్కరుడు వచ్చి. 301


జనవరి  30,2014

పనులు చెడిపోవు, వాస్తవ మనుదినంబు
పగటిపూట నిద్రింప, సంపద పెరుగును
సావధానాత్ములైయుండి సవ్యగతిని
వ్యవహరించుచు నుండెడి వారలకును.302 


జనవరి 31,2014
పండ్రెండు వత్సరంబులు
గండ్రేటి పురమ్మునందు క్రమముగ మా మా
తీండ్రల్ దీర్చిన పిల్లల
తండ్రీ! రమ్మనుచు బిలిచె తరుణి తనపతిన్. 303

రెండ్రోజులు మనమిచ్చట
గుండ్రాళ్ళేరంగవలయు కూర్చొన కీవున్
పౌండ్రక! రా నాపిల్లల
తండ్రీ! రమ్మనుచు బిలిచె తరుణి తనపతిన్. 304

కాండ్రించి యుమియ నాతడు
వాండ్రకు, వీండ్రకును పెద్ద వాదయ్యె, కనన్
పాండ్రంగ! దీనజనముల
తండ్రీ! రమ్మనుచు బిలిచె తరుణి తనపతిన్. 305


 ఫిబ్రవరి 01,2014
భవ్యమౌచు వెలుగుభక్తితో సతతంబు
రామ యనెడి నోరు, ఱాతిరోలు
తనివిదీర కొంత తడవైన శ్రీరామ
యనని నోరు సత్య మవనిలోన.  306


దీనజనుల కాస్థ, మానితంబుగ ప్రేమ,
మమత సమత సాటి మానవులకు
పంచకుండ సతము భక్తుండ నేనంచు
రామయనెడి నోరు ఱాతిరోలు.307


ఫిబ్రవరి, 02,2014
కక్ష దీరగ ఖండించి క్షత్రియులను
వరుస బలుమారు లలనాడు ధరణి నిట్లు
పరశురాముడు నిర్జించె, బాండవులను
గాసి బరచెను కురురాజు మోసమూని.  308



ఫిబ్రవరి, 04,2014 
ఆలోకవర్మ యనియెడు
బాలుడు తికమకను చెంది బడిలో పలికెన్
వ్యాలాలంకృత ఘనునకు
కాలొక్కటెకలదు మూడుకన్నున దొరకున్. 309


శ్రీలక్ష్మి యనెడు బాలిక
ఫాలంబున కన్ను జూచి పలికెను సఖితో
బాలా! చూడుము రా, టీ
కాలొక్కటె కలదు మూడు కన్నుల దొరకున్. 310



 ఫిబ్రవరి, 05, 2014 
గానకళాప్రవీణయని ఖ్యాతి వహించిన సుబ్బలక్ష్మికిన్
ధీనిధి కొక్కమారు బహుదివ్యసుభూషలు, వస్త్రరాశి స
న్మానములోన గూర్చి రభిమానులు, బాంధవు లెంచిచూడ నా
మానవతీలలామ కభిమానమెచాలును, చీర(యే)లేటికిన్.311


 ఫిబ్రవరి, 06, 2014  
మత్స్యయంత్రంబు జలములో మాత్రమరసి
యింపు లొలుకంగ నతడు ఛేదించ నపుడు
ద్రుపదరాట్పుత్రి కర్ణుని తోడబుట్టు
వైన క్రీడిని వరియించె నందమొప్ప.  312


  ఫిబ్రవరి, 07, 2014  
ఔషధంబులు గొన్నింటి కవసరమగు
సత్య మియ్యది నమ్ముడు సర్వజనులు
పలుకగానేల యీరీతి నలుపటంచు
మేక,మెడ? చన్నుపాలతో మేలుగలుగు.  313



  ఫిబ్రవరి, 10, 2014  
పలుకంగా తరమగునే
యిలలో నెవ్వారిభాగ్య మెటులుండునొ? నౌ
కలు బండ్లౌటను కనమా,
పులిగడ్డిని మేయు మాంసమును దిను జింకల్. 314


   ఫిబ్రవరి, 11, 2014  
భరతనాట్యంబు చేయుట కరుగువేళ
సుదతి యొక్కర్తె మిక్కిలి ముదముతోడ
పెద్దదైనట్టి యద్దాన స్వీయభంగి
మ గని జడలోన మందార మాల ముడిచె.   315


ప్రాణనాథుని కన్నను పడతి కిలను
వేరు దైవంబు లేనట్టి కారణమున
నతని కానందమునుగూర్చ నతివ మ్రొక్కి
మగని, జడలోన మందార మాల ముడిచె.316


   ఫిబ్రవరి, 12, 2014  
"మ,న"యను రెండక్షరములు
మనమున స్మరియించుచుండి మాన్యుం డొకడున్
తనవారితోడ బలికెను
మన మన మన మనమె మనమె మన మన మనమే.  317


ఫిబ్రవరి, 13, 2014  
జగమంతయు క్రైస్తవమున
కెగబడుచున్నట్టి వేళ నితిహాసంబుల్
నిగమంబులు రుచియించునె?
భగవద్గీతయె విషమ్ము భారతభూమిన్. 318



ఫిబ్రవరి, 14, 2014   
సంధి చేయుము కురురాజ! సభకు బిలిచి
కలుగు సంతసం బిల్లును వెలుగు దాన
నరయ వలయును ప్రతినిధి విరువురకును
వలదు తగవిక కౌరవపాండవులకు.319


 ఫిబ్రవరి, 15,  2014   
కష్టములు కలుగజేయును
దుష్టాచారములె, ముక్తి దొరకొన జేయున్
శిష్టాచారము లూనుచు
నిష్టంబుగ చేయుపూజ లిమ్మహిలోనన్.  320



 ఫిబ్రవరి, 16,  2014   
తల్లులు ముజ్జగంబులకు తారు భవానియు, వాణి, లక్ష్ము లీ
యెల్లర గావబూని భువికేగిన యట్టుల తీర్చియుండ నా
పల్లెకు జేరి యొక్కరుడు భక్తియు, శ్రద్ధయునూని వృద్ధయౌ
తల్లిని గూడి, చిత్రముగ తామరసాక్షుల గాంచె మువ్వురన్. 321


వల్లియు, నామెచెల్లియగు భారతి, యక్క సుహాసినీత్రయం
బెల్లసులక్షణాఢ్యలిక నింపులు,సొంపులు గుల్కువారలౌ
యిల్లలితాంగులందు మనసెవ్వతె దోచునొ యంచు నాతడున్
తల్లిని గూడి, చిత్రముగ తామరసాక్షుల గాంచె మువ్వురన్.  322



 ఫిబ్రవరి, 17,  2014   
సుంత యైనను లేదను చింత యేల
తినుట, కచ్చోట పెండ్లిని కనుము రమ్ము
భవ్యమౌరీతి భుజియింపవచ్చు పెండ్లి
వారమన, రెండుదినములు వారిజాక్ష!  323


  ఫిబ్రవరి, 17,  2014   
ఒక్కబడిలోన విద్యార్థు లుంచినట్టి
సౌరపరివార చిత్రాల శాలయందు
దీపములమధ్య నెంతేని దీప్తి బయట
చంద్రబింబమ్ము, లోన భాస్కరుడు వెలిగె. 
324


ఫిబ్రవరి, 18,  2014   
శ్రమియించి క్షీరసాగర
మమరులు దానవులు తరియ నాసమయమునం
దమరిన దెయ్యది ప్రథమం
బమృతమ్మో, ప్రాణఘాతమగు గరళమ్మో?     325


తమపంతము నెరవేరగ
సమతను పాటించకుండ సకలాంధ్రంబున్
క్రమముగ జీల్చిన కార్యం
బమృతమ్మో, ప్రాణఘాతమగు గరళమ్మో?  326 



ఫిబ్రవరి, 21,  2014   
ధ్యానము చేసినన్ పలికి, దైన్యత గూల్చుచు నెల్లవేళలన్
మానక గాచుచుండెడి రమాధవు, నచ్యుతు, లోకరక్షకున్
శ్రీనిలయున్, జనార్దనుని, చిన్మయరూపుని, జాతిభేదముల్
కాననివాని నూతగొని కాననివారలు పొంది రున్నతుల్.327


 ఫిబ్రవరి, 22,  2014   
అట్లుతిని వీధిలోగల
జట్లను దాజేరి యొకడు సరసుండగుచున్
చీట్లాటలోన బలికెను
ముట్లుడిగిన రాధకిపుడు మూడవ నెలరా.  328



మార్చి, 05,2014
ఆకంసుని పరిమార్చెను
శ్రీకృష్ణుడు, శూర్పణఖకు చెవులం గోసెన్
తేకువ మీరగ లక్ష్మణు
డేకాలము దుష్టజాతి కిట్లగు నుర్విన్. 329


 మార్చి, 06,2014
ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకండ్రు
..........మద్యవిక్రేతలౌ మనుజులెల్ల
ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకండ్రు
..........బాలబాలిక లిలన్ బహుళగతుల
ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకండ్రు
..........వాహనచోదకుల్ వైభవముగ
ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకండ్రు
..........గ్రామీణకర్షకుల్ శ్రామికులును
కారణంబులు చూడంగ క్రమత మద్య
విక్రయంబులు పెరుగును, విద్యలకును
సెలవు లభియించు, తమనెందు దలతురిలను,
పేరు పేరున తమకందు గౌరవంబు. 330


ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకంచు
..........వచియించగానేల వసుధలోన
అభివృద్ధి యణగారు, విభవంబు క్షీణించు
..........ధనధాన్య సంపత్తి తరగిపోవు
కలహంబు లధికమై యిలలోన ద్వేషంబు
..........లినుమడించునుసతం బనుచితముగ
నిత్యంబులైనట్టి కృత్యంబులన్నియు
..........చెదరిపోవుటె కాదు ముదమణంగు
కాన నేటేట నెన్నికల్ మానవులకు
హితము కలిగించు ననువాక్య మించుకేని
సత్య మనదగ దెన్నికల్ జరుగవలయు
నైదు వర్షాల కొకసారి మోదమొదవ. 331




07.03.14
గరుడుడు పామును మ్రింగుట
నరసిన యొక చిన్నబాలు డతిభీతుండై
పురమేగి పలికె తడబడి
గరుడుని మ్రింగిన దట భుజగమ్ము గుటుకునన్  332.

 08.03.14
చేతంబు లలరజేయుచు
మాతకు కౌసల్య కొసగ మహితానందం
బాతన్వికి నాథుండై

సీతకు, రాఘవుడుపుట్టి శివధనువెత్తెన్. 333.


 10.03.14
ధూర్తుండై జనకజ నపు
డార్తికి గురిచేయువాని, నఘసంయుతు, దు
ర్వర్తను, రాముడు రాక్షస

భర్తను వధియించ వనిత పరితోషించెన్.  334

 11.03.14
అనుమానమేల వీనిని
చనుబాలం గుడిపి యముని సదనంబునకున్
కనుడిదె పంపెదనని పూ

తన, బాలుని చంపనెంచి తానే జచ్చెన్. 1. 335

అనయము హరినామము తా
ననుపమముగ బల్కువాని, నసురాధిపుడున్
ఘనుడౌ హిరణ్యకశిపుడు

తనబాలుని జంపనెంచి తానే జచ్చెన్. 2.  336


13.03.14
పరమ దుర్మార్గుడైనట్టి నరున కిలను
సద్గుణాఢ్యుడు జన్మించు సరణి నరసి
పలుకగా వచ్చు నుపమాన మొలుక నిట్లు

"పందికిన్ బుట్టె చక్కని పాడియావు"   337


14.03.14
పన్నెండవతరగతిలో
మున్నొక తడబాటుతోడ మోహనుడనువా
డన్నాడు మిత్రులారా!

వెన్నెల ఱేని వెలుగులకు విచ్చె గమలముల్  338.


17.03.14

సాటివారియందు సహకారభావంబు
భూతదయయు ధర్మభీతి భువిని
మాతృదేశభక్తి మనమున లేకున్న
విష్ణుపూజ నరులు విడువదగును.  339.


18.03.14
శ్రీకరుడను మునివర్యుడు
ప్రాకటముగ తపముచేయు ప్రాంతమునందున్
చీకాకు నొందకుండగ
కాకియు గోకిలయు గలసి కాపురముండెన్. 340


23.03.14
చేతంబు లలరజేయును
గీతాపారాయణంబు, గీడొనరించున్
భూతలమున పాఠకజన
పాతకములకు, పరమునను భాగ్యం బొసగున్. 341.











Sunday, January 26, 2014

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మ.  మనదేశంబు పవిత్రభూమి కనగా మాన్యుల్ మహానాయకుల్
       ధనమానంబులు ధారవోసి యకటా! ధైర్యంబు గోల్పోక భా
       వనలోనైనను స్వార్థమూనక సదా స్వాతంత్ర్య సంపాదనా
        ఘనలక్ష్యంబును బూని సాగిరిగదా! కారుణ్యభావంబునన్.

సీ.    ఎందరో మహనీయు లీకర్మభూమిలో
                      పుణ్యమంతయు ధారపోసినారు,
        ఎందరో ధర్మాత్ము లీధరాస్థలిలోన
                      స్వాతంత్ర్యసమరంబు జరిపినారు,
        ఎందరో కరుణాఢ్యు లీధర్మకార్యాన
                     చెరసాలలోనుండ జేరినారు,
        ఎందరో పుణ్యాత్ములీయజ్ఞవహ్నిలో
                     సమిధలై పొందినా రమలయశము
ఆ.వె.  త్యాగధనులు వారు యోగంబుగా బూని
          హృద్యమైనరీతి నుద్యమించి,
          సకలభారతాన స్వాతంత్ర్యదీప్తుల
          సిరులు విస్తరింప జేసినారు.

ఆ.వె.  అనుచు సభలలోన ననునిత్య మానంద
          మందుచుంట కాదు, సుందరమగు
          భారతమున దివ్యభావంబు వెలుగొందు
          నట్లు చేయవలయు నందరకును.

సీ.      వినయదీప్తి కలిగి విద్యార్థిగణములు
                      శ్రద్ధబూనుచుండి చదువవలయు,
          సకలజనులలోన సౌభ్రాతృభావంబు
                      విస్తరించవలయు వివిధగతుల,
         జగతిలోన సతము శాంత్యహింసలగంధ
                     మలముకొనగ వలయు నందమొప్ప,
         మానవాళిలోన మమతానురాగంబు
                    లినుమడింప వలయు నెల్లవేళ,
ఆ.వె.  భరతభూమిలోన పాడిపంటలవృద్ధి
          కలుగవలయు నెల్ల గతుల ననుచు
          కాంక్షజేయుచుంటి గణతంత్రదినసభా
          ప్రాంగణంబునుండి బంధులార!