68వ స్వాతంత్ర్యదినోత్సవసందర్భంగా
విద్యార్థులకు కర్తవ్యబోధ
సీసమాలిక
బాలబాలికలార! భవ్యభారతమందు ప్రభవించు సద్భాగ్యవిభవమబ్బె
ఏజన్మలో మీర లేపుణ్యకార్యంబు
లాచరించిరొగాని యనుపమమగు
జన్మమిమ్మహిలోన సన్మానయుతముగా
పొందియున్నారెంతొ సుందరంబు
వేదాల పుట్టిల్లు, మోదాల నిలయంబు,
శాస్త్రషట్కంబుల స్థానమిద్ది
ఇతిహాసగ్రంథంబు లీధరాస్థలిలోన
విలసిల్లు నిత్యంబు లలితగతిని,
అష్టాదశంబులౌ నాపురాణంబుల
జన్మప్రదేశ మీక్ష్మాతలంబు,
ముక్కోటి దేవతల్ చక్కంగ నీనేల
సద్రూపధారులై సంతతంబు
సంచరించుచునుండి సానందచిత్తులై
వరములిచ్చుచు నుందురురుతరముగ,
ఘనగుణుల్ మునివరుల్ కశ్యపాత్ర్యాదులు
క్షేమంబు లరయ నీభూమిపైన
తిరుగాడుచుండు రిద్ధరణిమాహాత్మ్యంబు
వర్ణింపదరమౌనె బ్రహ్మకైన
పరమపావనమైన భారతావనిలోన
పారతంత్ర్యము నాడు పేరుకొనగ
స్వార్థంబు విడనాడి సర్వంబు త్యజియించి
ప్రాణాలు సైతంబు పణము బెట్టి
బందిఖానాలలో బహుకష్టములకోర్చి
యవమాన మనునిత్య మనుభవించి
ఛీత్కరించుచు జేరి చెదరగొట్టిన గాని
సంకల్పసిద్ధికై సడలకుండ
సత్యాగ్రహంబుతో సన్మార్గగాములై
పోరాట మొనరించు వీరవరుల
బలిదాన ఫలముగా భారతోర్వరలోన
స్వాతంత్ర్యపవనాలు వ్యాప్తమయ్యె
నిత్యకల్యాణంబు, నిరతసంతోషంబు
లీపుణ్యభూమిలో నెల్లయెడల
ప్రభవించి సర్వత్ర శుభదర్శనంబయ్యె
జీవనంబున జూడ క్షేమమొదవె,
సంతోషజలధిలో సతతంబు మునుగుచు
హాయినందుచునుండి రఖిలజనులు
హర్షమో, గర్వమో, యదిగాక నిర్లక్ష్య
భావమో గాని యీ భరతభూమి
నెల్లచోటులయం దుల్లసిల్లుచునుండె
యవినీతి భూతమై యనుదినంబు
సౌభ్రాతృభావంబు సన్నగిల్లుటెగాదు
మతమౌఢ్య మలమెను మతులలోన
విభజనవాదంబు విస్తరించుచునుండె
స్వార్థమే లక్ష్యమై సాగుచుండె,
పాలకాగ్రణు లిందు పరమహర్షంబుతో
కుడుచుచుండిరి నిధుల్ కోట్లకొలది
ధరలు నింగినిదాకె, నరునిజీవన మేమొ
దుర్భరంబై యిలన్ దు:ఖ మొదవె,
అరువది యేడేండ్లు జరిగిపోయెనుగాని
సమ్మాన మతివకు సన్నగిల్లె,
అభివృద్ధి యనుమాట లల్లంతదూరాన
తాము గ్రంథములందు దాగియుండె,
అక్రమంబులు దౌష్ట్య మన్యాయకృత్యంబు
లనునిత్య మీనేల నధికమయ్యె,
సత్కార్యదీక్షలో సన్మార్గగమనాన
సత్యవాక్పాలనాకృత్యమందు
జనులలో నొకయింత సహకారభావంబు
మృగ్యమై కపటంబె యోగ్యమయ్యె,
మాతృదేశముపట్ల మమతానురక్తులీ
ధరణిలోనను క్షీణదశకు జేరె,
సోదరుల్ శత్రులై భేదభావముబూని
చరియించుచుండిరి సర్వజగతి
యీపరిస్థితులందు నీరీతి ప్రతియేట
జాతీయపర్వముల్ శ్రద్ధబూని
చేయుచుంటిమి మాకమేయమౌ సద్భక్తి
దేశాన గలదంచు దీక్షజూపి
గీతాలు పలికించి చేతంబులలరించి
మువ్వన్నె జెండాలు మురిపెమునను
గగనమంటెడునట్టు లెగురవేయుచు నిల్చి
యమరవీరుల త్యాగ మందమొప్ప
వక్తృత్వపటిమతో వైభవోపేతమౌ
యాటపాటలతోడ దీటుగాను
వారంచు వీరంచు పేరులు వల్లించి
పూర్వగాథలనెల్ల బోధజేసి
వత్సరానికి రెండు పర్యాయములు నిట్లు
స్మరణచేసిన చాలు వరుసననుచు
దలచిన చాలునా? ధన్యత్వమొదవునా?
మాతృదేశపుసేవ మరువదగునా?
భాగ్యనిధియౌచు వెలిగిన భారతాన
నిత్యతాండవమాడుచు నిలిచియున్న
ఘోరమైనట్టి యవినీతి, కుటిలమతియు,
స్వార్థభావంబు, దౌష్ట్యంబు, సకలగతుల
వంచనంబులు, బహువిధవైరములును,
మతము పేరిట యిలవారు గతులుదప్పి
క్రౌర్యములనూని మనుటయు, కనికరంబు
చూపకుండుట, నిత్యంబు శోకజలధి
మునుగుచుండెడివారల ననునయించి
సాయమందించలేమియు, సన్మతిగని
యంతమొందించు ప్రతిన లియ్యవసరమున
బూని మున్ముందు సద్భావ పూర్ణులగుచు
సంచరించుచు, కష్టాల సాగరమున
కూలియున్నట్టి భారతకువలయంబు
నుద్ధరించెడి కార్యాల నుత్సహించి
ముందుకేగుచు యిసుమంత సందియంబు
నందకుండగ విఘ్నాల నధిగమించి
సాగుచుండుచు సర్వత్ర సద్యశంబు
లందవలె మీరు సచ్ఛాత్రు లందమొప్ప
శుభము గల్గెడు నానాడు విభవపంక్తి
నిండు భారతదేశాన మెండుగాను
దేశభక్తుల త్యాగాల దీప్తియపుడు
వ్యాప్తమై యొప్పు దిశలలో ననుట నిజము
సవ్యమైనట్టి స్వేచ్ఛయు నవ్యసుఖము
లందగలవప్పు డనుటలో సందియంబు
లేదొకింతయు బాలకుల్ మోదమందు,
జన్మసాఫల్య మావేళ ఛాత్రులార!
పొందవచ్చును, ప్రతినను బూనరండు
భావిభారతపౌరులౌ బాలలార!
వారు వీరను భేదంబు చేరనట్టి
విమలచిత్తాఢ్యులైయుండు పిన్నలార!
అతులతేజంబు గల్గు విద్యార్థులార!
No comments:
Post a Comment