Saturday, September 13, 2014

వరసిద్ధవిఘ్నేశ్వర



శ్రీరామ
వినాయక దండకం(జ.న.వి.కిల్తంపాలెం విద్యార్థుల నిమిత్తం)
శ్రీసిద్ధివిఘ్నేశ్వరా! దేవ!దేవాధిదేవా! ఉమానందనా! స్వామి! భద్రేభవక్త్రా! సర్వార్థసంపత్ప్రదా! ప్రత్యబ్దసంపూజితా! నిన్ను కిల్తాఖ్యపాలెంబు నందున్న విద్యాలయంబందు విద్యార్థిసంఘంబులౌ మేము సద్భక్తితో స్థాపనం జేసియున్నార మీవేళ నీవద్ద బద్ధాంజలీయుక్తమౌ ముద్రలందాల్చి సప్తాహపర్యంత మాపైన రెన్నాళ్ళు నిత్యంబు వేళాద్వయంబందు శ్రద్ధాఢ్యతంబూని పూజించగా నిల్చియున్నార మోదేవ! మున్ముందుగా నాచతుర్థిన్ సుకల్పోక్తరీతిన్ విశేషంబులైనట్టి పత్రాదిసామగ్రినిం దెచ్చి, టెంకాయలున్ పుష్పముల్, మాలలున్, ధూపముల్, దీపముల్ గూర్చి, సత్పూజలం జేసి, యుండ్రాళ్ళు, వడ్పప్పు, బెల్లంబు, పండ్లప్పముల్, గారెలున్, బూరెలున్ దెచ్చి రుచ్యంబుగా నీకు నైవేద్యముల్ చూపి, విఘ్నేశ్వరోత్పత్తియు న్నాశ్యమంతాఖ్యమై యొప్పు నాఖ్యానమున్ శ్రద్ధతో నేకచిత్తంబునుంబూని చెప్పించుకొన్నాము, మంత్రోక్తరీతిన్ సుపుష్పంబు లందించియున్నాము, ఛత్రాదులున్, చామరంబుల్, సుగీతంబులు న్నీకెయర్పించియున్నార మోదేవ! యీదీక్షలో నిత్య మీరీతి సూర్యోదయంబందు, సాయాహ్నకాలంబునన్ నిన్నె యర్చించుచున్నాము, పూజావిధానంబు, మంత్రంబులం నేర్వలేమైతి అత్యుత్తమంబైన సద్వాక్య సంపత్తి యింతేనియున్ లేని యజ్ఞాన మందున్న మేమిచ్చటన్ జేయుచున్నట్టి పూజాదిసర్వోపచారంబులం స్వీకరించంగ నిన్వేడుచున్నాము, మాపైని కారుణ్యముంజూపుమా, యజ్ఞానమున్ ద్రుంచుమా, దోషముల్ సైచి,  సద్విద్యలందించుమా, ధాత్రిలో మాకు సద్బుద్ధి, విజ్ఞానసంపత్తి, సత్కీర్తి, యారోగ్యభాగ్యంబు, సత్త్వంబు, సన్మార్గసంచారధైర్యంబు, సత్పాత్రతాదీప్తితోడన్ జయం బెల్లకాలంబులం గూర్చి, సత్పౌరులం జేయుమా, దేశభక్తిన్ సదానిల్పి విద్యాభివృద్ధిన్ ప్రసాదించి మమ్మున్ వివేకాఢ్యులం జేయుమా, దేవదేవా! మహాకాయ! లంబోదరా! ఏకదంతా! గజాస్యా! సదావిఘ్ననాశా!మహేశాత్మజాతా! ప్రభూ! నాగయజ్ఞోపవీతా! భవానీతనూజా!త్రిలోకైకనాథా! సదామందహాసా! సురేంద్రా! గజేంద్రాననా! శూర్పకర్ణా! నమస్తే నమస్తే నమస్తే నమ:|

వరసిద్ధివినాయక నీ
కరుణను మాపైన జూపి కావుము మమ్మున్
నిరుపమమగు సద్విద్యలు
సురుచిర విజయాలు గూర్చి సుందరమూర్తీ!

శ్రీమంతంబగు కిల్తమాఖ్యపురిలో చిద్రూపముం దాల్చుచున్
స్వామీ! యిచ్చట యీ నవోదయమునన్ సత్పూజలం బొందుచున్
క్షేమంబుల్ విజయంబు లిచ్చుచు సదా చేయూతగా నిల్చుచున్
భూమిన్ కావుము ఛాత్రసంఘమునికన్ పూజ్యా! భవానీసుతా!

సీ.      గజవక్త్రమును దాల్చు కమనీయరూపియౌ
వరసిద్ధివిఘ్నేశ! వందనంబు
శూర్పకర్ణములూను సుందరాకారివౌ
వరసిద్ధి గణపతీ! వందనంబు
లంబోదరంబుతో సంబరంబులు నింపు
వరసిద్ధివిఘ్నేశ! వందనంబు
యజ్ఞోపవీతార్థ మహిరాజములు దాల్చు
వరసిద్ధి గణపతీ! వందనంబు
మోదకంబులవైపు సాదరంబుగ జూచు
వరసిద్ధివిఘ్నేశ! వందనంబు
ఇక్షుఖండముజూచి యెంతేని ముదమందు
వరసిద్ధి గణపతీ! వందనంబు
ప్రతివర్ష మరుదెంచి సతతసౌఖ్యం బిచ్చు
వరసిద్ధివిఘ్నేశ! వందనంబు
వివిధంబులైనట్టి విఘ్నసంతతి బాపు
వరసిద్ధి గణపతీ! వందనంబు
తలచిపిల్చినవారి కలఘుసంపదలిచ్చు
వరసిద్ధివిఘ్నేశ! వందనంబు
విజ్ఞానసంపత్తి విద్యార్థులకు గూర్చు
వరసిద్ధి గణపతీ! వందనంబు
కార్యాల నన్నింట ఘనజయంబులు నింపు
వరసిద్ధివిఘ్నేశ! వందనంబు
ఏరూపమున బిల్వ నారూపమున బల్కు
వరసిద్ధి గణపతీ! వందనంబు

ఆ.వె.  జవహరాఖ్యమైన చదువుల నిలయాన
మోదభరితమగు నవోదయాన
దీక్షబూని నిన్ను దివ్యసుందరదేహు
నుంచి పూజ చేయుచుంటి మిచట.
ఆ.వె.   మేము చేయు పూజ కామోదమును దెల్పి
స్వీకరించి, మమ్ము చేరదీసి
సుముఖముద్రతోడ శుభములందగజేసి
కావుమయ్య యెపుడు ఘనతరముగ.
ఆ.వె.   వినయదీప్తి యొసగి విద్యాభివృద్ధికై
యాశిషంబు లొసగి యఖిలములగు
నికషలందు మాకు నిరుపమ విజయాల
నందజేయుమయ్య! యనవరతము.

No comments:

Post a Comment