Monday, June 25, 2012

దత్తపది - 1

"అక్క - అన్న - వదిన - మామ" అనే పదాలను ఉపయోగిస్తూ  
రావణునకు మండోదరి చేసిన హితబోధను తెలుపుతూ  
నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయటం 
(25.06.2012)

అక్కట! నాశనకారణ
మిక్కాంతను దెచ్చుటన్న నీయమ నీకున్
దక్కదు  నీవది నమ్మిన
నక్కఱపడు  మామకీనమౌ వాక్యంబుల్.


కంది - పెసర - సెనగ - మినుము
పై పదాలను ఉపయోగిస్తూ  నచ్చిన ఛందస్సులో
పార్వతీకళ్యాణము గురించి పద్యం .
(07.05.2013) 
కాంత ముఖమది సిగ్గున కందియుండ
నందరాపె సరణులకు నబ్బురపడ
శివుడు ముడివేసె, నగజాత శిరసువంచె
వరుస మినుముట్టె జయజయ ధ్వానమపుడు.

గిరిజ పెండ్లి నాడు ధరణీధరుండంత
కంది పెసర సెనగ లందముగను
మినుములాదు లింక మేలైన పప్పులన్
వంటలందు గూర్చె వైభవముగ.  

Wednesday, June 20, 2012

శ్రీరామ,విష్ణు

రామా! నీకృప  గల్గెనేని ఘనుడై రాణించు, సత్సౌఖ్యముల్
భూమీశాది సమస్తసంపద లికన్ పూర్ణాయురారోగ్యముల్
క్షేమంబుల్, సుగుణంబులందుచు సదా శ్రీమంతుడై యెల్లెడన్
నామౌన్నత్యము గాంచు మానవుడిలన్ నైర్మల్యతన్ రాఘవా!

శ్రీమత్కోసలరాజశేఖర! ప్రభూ! సీతామనో(సతీ)వల్లభా!
స్వామీ! భక్తులపాలి కల్పతరువై సత్సంపదల్ నిత్యమున్
భూమిం బంచుచు భారతీయులకికన్ భోగంబు లందించుచున్
రామా! సాధుగుణంబు లిమ్ము దయతో  రాజేంద్ర! హే రాఘవా!


శా.
రామా! నీపదధూళిసోకినశిలన్ రమ్యాతిరమ్యంబుగన్
రామాకారిణిగా నొనర్చి యఘసంత్రాసమ్మునుం గూల్చి సత్
క్షేమంబందగజేయు నీమహిమకున్ 'జే'యందు సద్భక్తితో
బ్రేమంజూపి యనుగ్రహించు మిపుడీ భీతున్ భవద్భక్తునిన్.

ఉ.
ఈతని బోలు దైవమిల నెందును లేడు  మమత్వదీప్తితో
నీతని గొల్చువారలకు నిచ్చుచు నుండు సమస్తసౌఖ్యముల్
రాతిని నాతి జేసి శుభరాశిని గూర్చి ముదంబు గొల్పె, నే
నాతని భక్తితో దలతు నారఘురాముని  వత్సలాఢ్యునిన్.

ఆత డనంతశక్తియుతు డాతని సన్మహిమావిశేషముల్
చేతము సంతసిల్లు విన, జిత్సుఖ మందును వాస్తవమ్ము నా
డాతని పాదధూళి కణ మాశిల నచ్చెరువంద నింతిగా
భూతలినిన్ బొనర్చి కడుపోడిమి నింపెను వాని కంజలుల్.

మానక నిను నే గొలిచెద
నీనామమె దలచువాడ నిత్యము రామా!
నానావిధ సంకటముల
తోనిండిన బ్రతుకులోన దుష్టిని గాంచన్.

శా.
సామీప్యంబున జేరబోదఘము లేశంబైన శ్రీరామునిన్
క్షేమాకారుని భక్తితో గొలిచినన్ శ్రీలందు నిత్యమ్ముగా
భూమిన్ సౌఖ్యము లందుచుండు నిజమో పుణ్యాత్ముల వ్వాని స
న్నామంబున్ స్మరియింపు డెల్లెడల సన్మానంబులన్ గాంచగన్.

ల..
లలితాకారము సద్గుణప్రకరమున్ రాజీవనేత్రంబులున్
కలుషాహంకృతిజూపువారలపయిన్ గ్రౌర్యమ్ము వీరత్వమున్
నెలవైయుండిన రాఘవేంద్ర! వినుమా నిన్గొల్తు నిత్యమ్ము నా
ఖలతాసంస్కృతి ద్రుంచి కావవలయున్ గారుణ్యరత్నాకరా!
శా.
వైకుంఠున్ గరుణావిశేషనిలయున్ భాగ్యప్రదున్ శాశ్వతున్
శ్రీకంఠాదిసమస్తదేవవినుతున్ జిన్మూర్తినిన్ జిష్ణునిన్
లోకార్త్త్యంతకు ధర్మరక్షకు  నజున్ లోకైకవీరున్ బ్రభున్
చీకాకుల్ దొలగించి గాచుటకునై "జే"యంచు బ్రార్థించెదన్.

Tuesday, June 12, 2012

హరివంశం

కం.
శ్రీమంతంబై పెక్కురు
ధీమతులకు నిలయమౌచు తేజోమయమౌ
గ్రామము కృష్ణామండల
భూమిన్ మరి "మోగులూరు" భోగదమదియున్.
కం.
తరముల పూర్వము కొందరు
హరివంశజు లచటి నుండి హరికీర్తనులై
సరియగు "సంగళ్ళా"ఖ్యపు
పురమునకిక జేరినారు పూజ్యులనంగా.
కం.
సంగళ్ళే నావలుగా(సాధనమై)
సంగతముగ కృష్ణమీద సాగుట వలనన్
"సంగళ్ళపాలె"నామం
బంగీకృతమయ్యె నిజ మటందురు విబుధుల్.
కం.
పారును కృష్ణానది యట
జోరుగ, తత్తటముపైన శోభిల్లునుగా
నారయ సంగళపాలెము
తోరంబగు శాంతినిండి తుష్టిద మగుచున్.
కం.
హరివంశీయులకాపురి
నిరతానందంబు లొసగి నిత్యసుఖంబుల్
వరగుణములు, సద్యశముల
నరమర లేకుండ గూర్చు ననవరతంబున్.
కం.
సురుచిర రూపుడు బహుసుం
దరగుణములతోడవెల్గు ధన్యుడతండున్
హరికోటేశ్వరవర్యుడు
చిరకాలము వాసముండె సిద్ధం బచటన్.
సీ.
అన్నప్ప యనుపేర హరికులశ్రేష్ఠుడై
బహుకీర్తి బడసిన భవ్యగుణుడు
విజ్ఞానఖని యౌచు విప్రవర్యులలోన
ఖ్యాతినందినయట్టి ఘనుడు తాను,
సద్గుణంబులరాశి సన్మార్గవర్తిని
సత్యనిష్ఠోపేత సాధుచరిత
దుర్గాంబ నామాన దు:ఖదూరిణి యంచు
పేరుగడించిన  విజ్ఞురాలు
తే.గీ.
వారి నోముల పంటయై సూరిజనుల
గొల్చి వెలుగొందు వాడౌచు కువలయమున
నఖిలసద్గుణ సంపన్ను డనగ నపుడు
"వేంకటేశుండు" జనియించె వినయశీలి.
సీ.
బాల్యంపు దశయందె బాలభానుని భంగి
దివ్య దేహంబుతోఁ దేజరిల్లె
ఆటపాటలతోడ నాతల్లిదండ్రికి
నత్యంత మోదంబు నందజేసె
చదువుసంధ్యలలోన సత్కీర్తి నందుచు
బ్రహ్మతేజంబుతో పరిఢవిల్లె
వృద్ధసేవలలోన విజ్ఞుడై వెలుగొంది
వినయవర్తనుడంచు ఘనత బొందె,
తే.గీ.
స్వీయగుణముల జననికిఁ జిత్తమందు
హర్షమొందింప జేయుచు నాత్మజుండు
జనకు నాశీస్సులందుచు ననవరతము
వేంటేశుండు వర్తిల్లు విమలగుణుడు.
కం.
నవవర్ష ప్రాయుండును
సువిమల వర్తనుడునైన సుతునకు జరిగెన్
భవుకరుణన్నుపనయనము
వివిధాగమపఠనఁ జేయ విస్తృత బుద్ధిన్.
ఆ.వె.
నిఖిల వేదశాస్త్ర నిష్ణాతుగావింప
నిత్యధర్మ సూక్త నిపుణుఁ జేయ
కూర్మితోడ నంత గురువుల చెంతకు
పంపి నారు వారు బాలు నపుడు.