Tuesday, June 12, 2012

హరివంశం

కం.
శ్రీమంతంబై పెక్కురు
ధీమతులకు నిలయమౌచు తేజోమయమౌ
గ్రామము కృష్ణామండల
భూమిన్ మరి "మోగులూరు" భోగదమదియున్.
కం.
తరముల పూర్వము కొందరు
హరివంశజు లచటి నుండి హరికీర్తనులై
సరియగు "సంగళ్ళా"ఖ్యపు
పురమునకిక జేరినారు పూజ్యులనంగా.
కం.
సంగళ్ళే నావలుగా(సాధనమై)
సంగతముగ కృష్ణమీద సాగుట వలనన్
"సంగళ్ళపాలె"నామం
బంగీకృతమయ్యె నిజ మటందురు విబుధుల్.
కం.
పారును కృష్ణానది యట
జోరుగ, తత్తటముపైన శోభిల్లునుగా
నారయ సంగళపాలెము
తోరంబగు శాంతినిండి తుష్టిద మగుచున్.
కం.
హరివంశీయులకాపురి
నిరతానందంబు లొసగి నిత్యసుఖంబుల్
వరగుణములు, సద్యశముల
నరమర లేకుండ గూర్చు ననవరతంబున్.
కం.
సురుచిర రూపుడు బహుసుం
దరగుణములతోడవెల్గు ధన్యుడతండున్
హరికోటేశ్వరవర్యుడు
చిరకాలము వాసముండె సిద్ధం బచటన్.
సీ.
అన్నప్ప యనుపేర హరికులశ్రేష్ఠుడై
బహుకీర్తి బడసిన భవ్యగుణుడు
విజ్ఞానఖని యౌచు విప్రవర్యులలోన
ఖ్యాతినందినయట్టి ఘనుడు తాను,
సద్గుణంబులరాశి సన్మార్గవర్తిని
సత్యనిష్ఠోపేత సాధుచరిత
దుర్గాంబ నామాన దు:ఖదూరిణి యంచు
పేరుగడించిన  విజ్ఞురాలు
తే.గీ.
వారి నోముల పంటయై సూరిజనుల
గొల్చి వెలుగొందు వాడౌచు కువలయమున
నఖిలసద్గుణ సంపన్ను డనగ నపుడు
"వేంకటేశుండు" జనియించె వినయశీలి.
సీ.
బాల్యంపు దశయందె బాలభానుని భంగి
దివ్య దేహంబుతోఁ దేజరిల్లె
ఆటపాటలతోడ నాతల్లిదండ్రికి
నత్యంత మోదంబు నందజేసె
చదువుసంధ్యలలోన సత్కీర్తి నందుచు
బ్రహ్మతేజంబుతో పరిఢవిల్లె
వృద్ధసేవలలోన విజ్ఞుడై వెలుగొంది
వినయవర్తనుడంచు ఘనత బొందె,
తే.గీ.
స్వీయగుణముల జననికిఁ జిత్తమందు
హర్షమొందింప జేయుచు నాత్మజుండు
జనకు నాశీస్సులందుచు ననవరతము
వేంటేశుండు వర్తిల్లు విమలగుణుడు.
కం.
నవవర్ష ప్రాయుండును
సువిమల వర్తనుడునైన సుతునకు జరిగెన్
భవుకరుణన్నుపనయనము
వివిధాగమపఠనఁ జేయ విస్తృత బుద్ధిన్.
ఆ.వె.
నిఖిల వేదశాస్త్ర నిష్ణాతుగావింప
నిత్యధర్మ సూక్త నిపుణుఁ జేయ
కూర్మితోడ నంత గురువుల చెంతకు
పంపి నారు వారు బాలు నపుడు.

No comments:

Post a Comment